
ముగ్గురు మత్స్యకారులు మృతి చెందగా మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు.
తిరువనంతపురం : కొచ్చి తీరంలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మత్స్యకారులు మృతి చెందగా మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. వివరాలు... మంగళవారం తెల్లవారుజామున చెత్తువా తీరంలో చేపలు పట్టేందుకు మూనంబం నుంచి 15 మంది మత్స్యకారులు పడవలో బయల్దేరారు. వీరంతా ప్రయాణిస్తున్న పడవను భారీ నౌక ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
గాలింపు చర్యలు చేపట్టాం : కేరళ ఫిషరీస్ మంత్రి
ఈ ఘటనపై స్పందించిన కేరళ ఫిషరీస్ మంత్రి జే మెర్సికుట్టి అమ్మ మాట్లాడుతూ... హెలికాప్టర్, డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ‘ప్రమాద బాధితులను రక్షించడమే మా తక్షణ కర్తవ్యం. మత్స్యకారుల పడవ నిబంధనలు అతిక్రమించి నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించిందా అన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నాం. అయినా ఆ విషయం ఇప్పుడు మాట్లాడదలచుకోలేదు. ప్రమాదానికి కారణమైన పడవను కనుగొనటానికి ప్రయత్నిస్తున్నామని’ తెలిపారు. కాగా రెండు నెలల క్రితం కూడా కొచ్చి తీరంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. విదేశీ నౌక ఢీకొనడంతో ఇద్దరు మత్స్యకారులు తీవ్రంగా గాయపడ్డారు.