
రిషబ్ చిట్‌ఫండ్ కార్యాలయానికి తీసుకువచ్చి వారి సమక్షంలోనే..
హైదరాబాద్: రిషబ్ చిట్ ఫండ్స్ మోసం కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు సీసీఎస్ అడిషనల్ డీసీపీ జోగయ్య తెలిపారు. చిట్‌ఫండ్స్ నిర్వాహకులు శైలేష్ గుజ్జర్, నందినీ గుజ్జర్‌లను బోయగూడలోని వారి నివాసంలోనే అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం వారిని రిషబ్ చిట్‌ఫండ్ కార్యాలయానికి తీసుకువచ్చి వారి సమక్షంలోనే సోదాలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ కేసులో సుమారు 600 మంది బాధితులు ఉన్నారని, దాదాపు రూ.70 కోట్ల వరకు చిట్‌ఫండ్స్ పేరిట మోసం జరిగినట్లు ప్రాధమిక విచారణలో తేలిందన్నారు.
బాధితుల నుంచి తీసుకున్న డబ్బును వివిధ వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టినట్లు తెలిసిందన్నారు. శైలేశ్ గుజ్జర్ ఇళ్లు, ఆఫీసులు, పలు డాక్యుమెంట్లు, బ్యాంకు అకౌంట్లు కూడా సీజ్ చేసినట్లు జోగయ్య తెలిపారు. నిందితులను రేపు కోర్టులో హాజరుపరుస్తామన్నారు.