చంద్రశేఖర్ (ఫైల్ ఫోటో)
అంబర్‌పేట : గుప్త నిధుల ఆశ అతని ప్రాణం తీసింది. హత్యకు గురయ్యే వరకు అతను గుప్త నిధుల మైకంలోనే ఉన్నాడు. తనను పూడ్చిపెట్టేందుకు గొయ్యి తీయడంలోనూ నిందితులకు సహాయపడ్డాడు. తననే గోతిలో వేసి హత్య చేస్తారని పసిగట్టలేక పోయాడు.30 రోజులు తర్వాత హత్య కేసులో మిస్టరీ వీడిన సంఘటన అంబర్‌పేట పోలీసు స్టేషన్ పరిదిలో గురువారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నంద్యాల సమీపంలోని కోడిమామిళ్లకు చెందిన చంద్రశేఖర్(47) దివ్యాంగుడు బతుకు దెరువు నిమిత్తం భార్య వరలక్ష్మితో నగరానికి వలసవచ్చి అంబర్‌పేట చెన్నారెడ్డి నగర్‌లో ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం అతడికి రైలులో సుల్తాన్ బజార్ సీఎస్‌లో హోం గార్డుగా పని చేస్తున్న గిద్దలూరుకు చెందిన వెంకటరామిరెడ్డితో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. తరచూ చంద్రశేఖర్ ఇంటికి వచ్చి వెళేకల వెంకటరామిరెడ్డి, చంద్రశేఖర్ భార్య వరలక్ష్మితో వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. దీనిని పసిగట్టిన చంద్రశేఖర్ భార్యను మందలించాడు. బంధువుల వద్ద పంచాయితీ పెట్టడంతో వరలక్ష్మి ఈ విషయాన్ని వెంకటరామిరెడ్డి చెప్పడంతో ఇద్దరూ కలిసి చంద్రశేఖర్ హత్యకు పథకం రచించారు.
గుప్త నిధుల బలహీనత ఆసరాగా...
చంద్రశేఖర్‌కు గుప్త నిధుల ఆశ ఉన్నట్లు తెలుసుకున్న వెంకటరామిరెడ్డి గత నెల జనవరి 11న అతడిని మంచాల పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతాలోకి తీసుకువెళ్లి అక్కడ గుప్త నిధులు ఉన్నట్లు చెప్పడంతో ఇద్దరూ కలిసి గొయ్యి తవ్వారు. అనంతరం అదే నెల 13న నిధులను తీసుకుందామని అదే ప్రాంతానికి తీసుకెళ్లాడు. పథకంలో భాగంగా వెంకటరామిరెడ్డి తన బంధువు రమేష్‌రెడ్డిని ఎల్‌బీ నగర్‌కు పిలుపించుకున్నాడు. ముగ్గురు కలిసి అక్కడే మద్యం కోనుగోలు చేసి ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న చంద్రశేఖర్‌ను హత్య చేసి, మంచాల పోలీసు స్టేషన్ పరిధిలో గోతిలో పుడ్చిపెట్టారు.
తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు...
అనంతరం చంద్రశేఖర్ భార్య వరలక్ష్మి తన భర్త కనిపించడం లేదని జనవరి 24న అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వరలక్ష్మి, ఆమె ప్రియుడు వెంకటరామిరెడ్డిపై చంద్రశేఖర్ బంధువులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. వెంకటరామిరెడ్డిని సంఘటనా స్థలానికి తీసుకెళ్లి పూడ్చిపెట్టి మృత దేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన నగరంలోని అంబర్‌పేట, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం, మంచాల పోలీసు స్టేషన్ల పరిధిలో చోటు చేసుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment