
పనాజీ : గోవాలో విషపూరిత గ్యాస్ లీక్ కావటంతో ఓ ఊరు మొత్తం ఖాళీ చేయాల్సి వచ్చింది. అమ్మోనియా గ్యాస్‌ను తీసుకెళ్తున్న ఓ ట్యాంకర్ ప్రమాదానికి గురై గ్యాస్ లీక్ కాగా.. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు దగ్గరుండి మరీ గ్రామస్థులను పొరుగు ప్రాంతాలకు పంపించి వేశారు. గురువారం అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురికాగా, వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేయిస్తున్నారు.
వాస్కో పట్టణం నుంచి పనాజీకి అమ్మోనియా గ్యాస్‌ను తీసుకెళ్తున్న ఓ ట్యాంకర్ ఉదయం 3గంటల సమయంలో చికాలిమ్ గ్రామం వద్ద హైవేపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ కావటంతో డ్రైవర్ అధికారులకు సమాచారం అందించాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఊరిని ఖాళీ చేయించారు. అంతా గాఢ నిద్రలో ఉండగా ఘటన చోటు చేసుకున్నప్పటికీ.. త్వరగతిన అప్రమత్తం కావటంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు. ఆ ఇద్దరు మహిళలు ప్రమాదం నుంచి బయటపడ్డారన్నారు.
ఇక గ్రామం వద్ద క్రాసింగ్ ఏర్పాటు చేసిన అధికారులు.. మరో దారి గుండా వాహనాలను మళ్లిస్తున్నారు. ప్రస్తుతం రెస్క్యూ టీం అక్కడి పరిస్థితిని సమీక్షిస్తోంది. గ్రామంలో 300 కుటుంబాలు ఉన్నాయని.. ప్రస్తుతం వారికి పొరుగు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో వసతి ఏర్పాటు చేశామని డిప్యూటీ కలెక్టర్ మహదేవ్ తెలిపారు. పరిస్థితి చక్కబడ్డాక వారందరినీ తిరిగి గ్రామంలోకి అనుమతిస్తామని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment