ఆర్మీ యూనిఫాంలో గవర శ్రీనివాసరావు పిల్లలతో శ్రీనివాసరావు భార్య యజ్ఞప్రియ
గోపాలపట్నం (విశాఖపట్నం) : ఇంటి నుంచి విధులకు పయనమైన ఆర్మీ అధికారి ఆచూకీ లేకుండాపోయింది. అటు విధుల్లో చేరక.. ఇటు కుటుంబ సభ్యులకూ అందుబాటులోకి రాకపోవడంతో ఏం జరిగిందో అంతుచిక్కడం లేదు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖ జిల్లా గోపాలపట్నం సమీపంలోని నరవ గ్రామానికి చెందిన గవర శ్రీనివాసరావు (40) ఆర్మీలో 20 ఏళ్ల సర్వీసు చేశారు. సిపాయి (గన్‌ఫిట్టర్)గా చేరి ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రం జలంధర్‌లో నాయక్‌గా పనిచేస్తున్నారు. భార్య యజ్ఞప్రియ, ఇద్దరు కొడుకులు పునీత్‌కుమార్(13), తరుణ్(10) ఉన్నారు. విధులు నిర్వహించే ప్రాంతంలోనే భార్యాపిల్లలతో ఉండేవారు. అయితే వచ్చే సెప్టెంబరు 30న ఆయన సర్వీసు పూర్తి కానుంది.
ఈ తరుణంలో సొంతూరు నరవ గ్రామంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు సొంత ఇల్లు కట్టుకుని మే 2న గృహప్రవేశం చేశారు. పిల్లలిద్దరినీ ఓ కార్పొరేట్ స్కూల్లో చేర్చారు. ఈ నేపథ్యంలో ఇటీవలే శ్రీనివాసరావుకు కపూల్‌తలాకు బదిలీ అయింది. ఉన్నది మూడు నెలల సర్వీసే. ఇంతలో బదిలీ అయిన తరుణంలో తాను అక్కడ సర్వీసు ముగించుకు వస్తానని మే 6న ఇంటి నుంచి బయలుదేరారు. దువ్వాడ రైల్వేస్టేషన్ వరకూ యజ్ఞప్రియ పిల్లలతో కలిసి భర్తను సాగనంపింది. జమ్మూ వెళ్లే రైలెక్కిన శ్రీనివాసరావు జలంధర్‌లో దిగి కపుల్‌తలాకు వెళ్లాల్సి ఉండగా... మే నెల 8న మధ్యాహ్నం తన ఫోన్, మనీ పర్సు పోయాయంటూ యజ్ఞప్రియకు తోటి ప్రయాణికుని నంబరుతో ఫోన్ చేసి చెప్పారు.
తన ఏటీఎం కార్డు బ్లాక్ చేయాలని, తాను ఉన్న ప్రాంతానికి డబ్బులు తేవాలని శ్రీనివాసరావు కోరారు. తర్వాత నుంచి అతని జాడ లేదు. అలాగని అంతకు ముందు నెంబరుకి ఫోన్ చేస్తే తాను ఓ స్టూడెంట్‌నని సమాధానం వచ్చింది. ఫోన్ కావాలంటే ఇచ్చాను తప్ప తనకెలాంటి సంబంధం లేదని చెప్పడంతో యజ్ఞప్రియ కలవరపడింది. అదే రోజు జలంధర్ యూనిట్ ఉన్నతాధికారులకు ఫోన్‌లో తన భర్త సంగతి చెప్పి ఆందోళన వెలిబుచ్చింది. మే 15న పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీనస్థితిలో కుటుంబం : శ్రీనివాసరావు అదృశ్యమయ్యాడని తెలిసి యజ్ఞప్రియతో పాటు పిల్లలు, తల్లిదండ్రులు దీనంగా ఉన్నారు. పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు ముసలమ్మ, రాములుకు, అంగవైకల్యంతో ఉన్న సోదరుడు కనకరాజు, సోదరి నాగమణికి శ్రీనివాసరావు వెలుగుగా నిలిచారు. సోదరికి వివాహం చేశాడు. చివరికి సర్వీసు పూర్తి చేసుకుని ఉన్న ఊళ్లో స్థిరపడాలని ఆశలు పెట్టుకున్న ఆయన ఇపుడు కనిపించలేదని తెలిసి ఎవరికీ తిండి సహించడం లేదు. ఇంటిల్లపాదీ ఆందోళనతో గడుపుతున్నారు.
మిస్టరీగా అదృశ్యం
శ్రీనివాసరావు అదృశ్యం మిస్టరీగా మారింది. భార్య ఫిర్యాదుతో పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు ఆర్మీ అధికారులకూ సమాచారం పంపారు. అదే సమయంలో యజ్ఞప్రియ జలంధర్, కపుల్‌తలాలో ఉన్న ఆర్మీ అధికారులను సంప్రదించింది. పానిపట్ నుంచి ఫోన్ చేశారని చెప్పి అక్కడా గాలించారు. అక్కడి స్టేట్ బ్యాంకులో మే 8న మధ్యాహ్నం శ్రీనివాసరావు తిరిగినట్లు, రూ.5 వేలు డ్రా చేసినట్లు సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు.
అయితే అదే రోజు తన మనీ పర్సు, సెల్‌ఫోన్ పోయిందని, డబ్బులు తేవాలని చెప్పిన శ్రీనివాసరావు తర్వాత బ్యాంకులో డబ్బులు ఎలా డ్రా చేశారని ఆరా తీస్తే చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లను చూపి నగదు పొందినట్లు అక్కడి అధికారుల ద్వారా తెలిసిందని యజ్ఞప్రియ చెప్పారు. తన భర్త ఎలా అదృశ్యమయ్యారో అర్థం కావడం లేదని ఆవేదన చెందుతోంది. జలంధర్‌లో రైలు దిగాల్సి ఉండగా, మార్గమధ్య పానీపట్‌లో ఎందుకు దిగినట్లు.. రైలెక్కాక ఎవరైనా పరిచయమై మోసగించారా.. లేక మరేం జరిగిందన్నది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment