ఫైల్ ఫోటో
కోటా : ఆనుపానూ చూసి, తమ చోర కళా నైపుణ్యాన్ని ప్రదర్శించే కేటుగాళ్లు నిరంతరం మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇలాంటి సంఘటన ఒకటి రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. క్షణం ఏమరుపాటు కారణంగా కిరాణా వ్యాపారి ఒకరు ఏకంగా 31.50 లక్షల రూపాయలను పోగొట్టుకున్నాడు. ఆనక లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.
ఈ సంఘటన బారన్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంకు చార్ మూర్తి సర్కిల్ బ్రాంచ్‌లో సోమవారం జరిగింది. కోటాకు చెందిన కిరాణా వ్యాపారి మహావీర్ గోయల్ నగదును బ్యాంకులో జమ చేసేందుకు ఐసీఐసీఐ బ్యాంక్‌కు వెళ్లాడు. అక్కడ పే-ఇన్-స్లిప్‌లో వివరాలు నింపి, దాన్ని పక్కనే ఉన్న కౌంటర్‌లో జమ చేయడానికి వెళ్లాడు. ఈ సందర్భంగా 31.50 లక్షల రూపాయలున్న బ్యాగును నగదు కౌంటర్ వద్ద వదిలిపెట్టి వెళ్లాడు. అయితే ఈ అదును కోసమే ఎదురు చూస్తున్న మాయగాళ్లు బ్యాగు తీసుకొని ఉడాయించారు. ఇదంతా కొన్ని సెకన్ల సమయంలో జరిగిపోయిందని గోయల్ వాపోయారు. ఈ దొంగతనంలో ఒకటి కంటే ఎక్కువ మంది నిందితుల ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్నామని పోలీస్ అధికారి మంగిలాల్ తెలిపారు. కేసు నమోదు చేసి సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment