సాక్షి హైదరాబాద్ : ఓ కారు 105 కిలోమీటర్ల వేగంతో బయల్దేరిన నిమిషంలోపే అదుపు తప్పింది. ఫ్లైఓవర్ మీదుగా.. 19 మీటర్ల ఎత్తు నుంచి గాల్లో ఎగురుతూ కింద రోడ్డుపై పడి.. చెట్టును బలంగా ఢీకొట్టింది. ఆ చెట్టు కింద కుమార్తెతో కలిసి బస్సు కోసం వేచి చూస్తున్న మహిళపై పడింది. ఈ ఘటనలో శరీర భాగాలు ఛిద్రమై.. మహిళ మృత్యువాత పడింది. చెట్టు కూకటివేళ్లతో సహా నేలకూలింది. నలుగురు గాయపడ్డారు. గచ్చిబౌలి బయోడైవర్సిటీ ప్లైఓవర్ జంక్షన్‌లో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఊహకందని ఘటనతో ఆ ప్రాంతమంతా భీతావహ వాతావరణం నెలకొంది. ప్రమాదం దరిమిలా.. ప్రభుత్వ ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఫ్లైఓవర్‌ను మూడు రోజుల పాటు పాక్షికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించారు.
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 86, ప్లాట్ నంబర్ 530లో నివాసం ఉండే కల్వకుంట్ల కృష్ణ మిలాన్ రావు (27) శనివారం మధ్యాహ్నం రాయదుర్గం వైపు నుంచి వోక్స్ వ్యాగన్ పోలో కారు (టీఎస్09 ఈడబ్ల్యూ 5665)లో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై నుంచి మైండ్‌స్పేస్ వైపు బయల్దేరారు. ఈ ఫ్లైఓవర్‌పై 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సి ఉండగా, ఆ సమయంలో కారు 105 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. అతి వేగంగా వెళ్తూ ఫ్లైఓవర్ మలుపు వద్ద ఒక్కసారిగా అదుపుతప్పింది.
1.04 నిమిషాల సమయంలో కారు ఫ్లైఓవర్ మీదుగా 19 మీటర్ల పై నుంచి.. కింద రోడ్డుపై ఉన్న నిసాన్ షోరూం ఎదుట పడింది. ఆపై పల్టీలు కొడుతూ చెట్టును ఢీకొట్టింది. ఆ ధాటికి చెట్టు కింద బస్సు కోసం వేచి చూస్తున్న పసల సత్యవేణి (56) తల, ఛాతీ భాగం ఛిద్రమై అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. ఆమె కాలేయంతో పాటు శరీర భాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడటంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. కారు బలంగా ఢీకొట్టడంతో చెట్టు కూకటివేళ్లతో సహా పడిపోయింది.
క్షతగాత్రులకు కేర్‌లో చికిత్స
ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు సమీపంలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
– కారు నడుపుతున్న కల్వకుంట్ల కృష్ణ మిలాన్ రావు.. కారులోని ఎయిర్ బెలూన్లు తెరచుకోవడంతో గాయాలతో బయటపడ్డారు. ఆయన తలకు, చెవికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
– కుర్బా (23).. ఛాతీకి తీవ్ర గాయాలవడంతో పక్కటెముకలు విరిగిపోయాయి. అనంతపురానికి చెందిన ఈమె ఆరు నెలల క్రితం నగరానికి వచ్చి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. పీపుల్ టెక్ కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లేందుకు ఆటో కోసం వేచి చూస్తూ ప్రమాదంలో గాయపడ్డారు. ఆమెకు ఆర్థోపెడిక్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
– ప్రయాణికులను ఎక్కించుకునేందుకు చెట్టు కింద వేచి చూస్తున్న ఆటో డ్రైవర్ ముడావత్ బాలూ నాయక్ (38) ఎడమ కాలి పాదం పూర్తిగా దెబ్బతింది.
– మృతురాలి కుమార్తె ప్రణీత స్వల్పంగా గాయపడ్డారు.
కుమార్తె కళ్లెదుటే..
మృతురాలు సత్యవేణి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు. ఏడాదిగా మణికొండలో ఉంటున్నారు. కుమార్తె ప్రణీతతో కలిసి అద్దె ఇల్లు కోసమని, కూకట్‌పల్లిలోని బంధువులను కలిసేందుకు బయల్దేరారు. మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో వీరిద్దరు చెట్టు కింద బస్సు కోసం వేచి ఉండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కళ్లెదుటే తల్లి సత్యవేణిని పొగొట్టుకున్న ప్రణీత (26) స్వల్ప గాయాలతో బయటపడింది. జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ మృతురాలికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.
చెట్టు కింద 12 మంది.. అంతా కకావికలం
కారు ఫ్లైఓవర్ నుంచి కిందపడిన సమయంలో చెట్టు కింద 12 మంది వరకు ఉన్నారు. ఈ చెట్టు కిందే ఆటోస్టాండ్ ఉంది. బస్సు కోసం కూడా ప్రయాణికులు ఇక్కడే వేచి చూస్తుంటారు. కారు రోడ్డుపై పడి, చెట్టును ఢీకొట్టగానే పెద్ద శబ్దం రావడంతో అంతా భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. నిసాన్ షోరూం ముందు పార్క్ చేసి ఉన్న కార్లపై చెట్టు పడటంతో ఐ10 గ్రాండ్, రెండు నిసాన్ మైక్రా కార్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. పల్టీలు కొట్టి కారు మీద పడడంతో మరో డట్‌సన్ కారు ధ్వంసమైంది.
చెట్టు కొమ్మలు అక్కడున్న కార్లపై పడటం, అక్కడున్న వారంతా పక్కకు పరుగెత్తడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఘటన స్థలాన్ని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్, ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్, వెస్ట్ జోనల్ కమిషనర్ హరిచందన దాసరి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు. ఈ ప్రమాదంతో ఫ్లైఓవర్ డిజైన్ తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రమాద దృశ్యాలు వైరల్ అయ్యాయి.
సినిమా షూటింగ్ అనుకున్నా..
స్కూటీపై వచ్చిన నేను నిసాన్ షోరూమ్ వద్ద కొద్దిసేపు ఆగాను. ఫ్లైఓవర్ పై నుంచి గాల్లో ఎగురుతూ కిందపడుతున్న కారును చూసి సినిమా షూటింగ్ జరుగుతుందనుకున్నా. నా పక్కనే కారు పడటం.. క్షణాల్లో చెట్టు కూలడం.. మహిళ చనిపోవడం.. అంతా పరుగులు తీయడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఘటనతో షాక్‌కు గురయ్యాను. నాలుగడుగులు ముందుకేస్తే నాకు ప్రమాదం జరిగేది.
– రాజేశ్వరి, విద్యానగర్, ప్రత్యక్షసాక్షి
105 వేగం.. అందుకే ప్రమాదం
బయోడైవర్సిటీ పై నుంచి కింద పడ్డ కారు 105 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ అదుపు తప్పింది. ఫ్లైఓవర్‌పై 40 కి.మీ. వేగంతో వెళ్లాల్సి ఉండగా అతి వేగం వల్లే ప్రమాదం చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ బృందం, ట్రాఫిక్ పోలీసులు ఈ ప్రమాదంపై అధ్యయనం చేస్తున్నారు. ఫ్లైఓవర్‌పై వేగ నియంత్రణ కోసం సూచికలు ఏర్పాటు చేశాం. వాహనదారుల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటాం.
– ‘సాక్షి’తో సైబరాబాద్ కమిషనర్ వి.సి.సజ్జనార్
20 రోజులు.. 3 మరణాలు.. 550 ఓవర్‌స్పీడ్ చలానాలు
దివ్యశ్రీ ఓరియన్ సెజ్ నుంచి మొదలయ్యే బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ 990 మీటర్ల పొడవునా ఐకియాకు వెళ్లే మార్గంలో ముగుస్తుంది. రూ.69.47 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ను ఈ నెల 4న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ 20 రోజుల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. ఈ నెల 10న ఇద్దరు యువకులు సెల్ఫీలు దిగుతూ.. కారు ఢీకొట్టిన దుర్ఘటనలో మృతి చెందారు. శనివారం జరిగిన ప్రమాదంలో మహిళ దుర్మరణం పాలైంది. కాగా, ఈ ఫ్లైఓవర్‌పై గత ఆరు రోజులుగా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా వాహనాల వేగాన్ని సాఫ్ట్‌వేర్ సహకారంతో గుర్తించి 550 ఓవర్ స్పీడ్ చలాన్లు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment