బీజేపీ ఎమెల్యే కుల్దీప్‌సింగ్ సెంగర్ (పాత చిత్రం)
లక్నో, ఉత్తరప్రదేశ్ : ఉనావో ప్రాంతంలోని యువతిపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. కేసును వెనక్కు తీసుకోవాలని కుల్దీప్ యువతి మావయ్య మహేష్ సింగ్‌ను బెదిరిస్తున్న ఆడియో రికార్డులు వెలుగులోకి వచ్చాయి. దీంతో కుల్దీప్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు.
‘మనమంతా ఒక్కటే. మన మధ్య గొడవలు పెట్టాలని కొంత మంది కావాలనే కుట్రపూరితంగా మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. అలాంటి కుట్రకు మీరు లొంగొద్దు. నాకు వ్యతిరేకంగా ఎటువంటి పనులు చేయొద్దు. కేసును వెనక్కి తీసుకుంటే మంచిది.’ అని కుల్దీప్‌సింగ్ యువతి మావయ్యను ఆడియో టేపులో హెచ్చరించారు.
యువతి తండ్రి సురేంద్ర సింగ్‌పై చేయి చేసుకున్న అతుల్(ఎమ్మెల్యే తమ్ముడు)ని తాను శిక్షిస్తానని ఈ సందర్భంగా కుల్దీప్‌సింగ్ యువతి మావయ్యకు హామీ ఇవ్వడం గమనార్హం. జైలులో అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి తండ్రి సురేంద్ర సింగ్ సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే.
కాగా, ఈ ఘటనలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతుల్‌ని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 302(మర్డర్) కింద కేసు నమోదైంది. ఉనావో ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎస్పీ చౌదరీ మాట్లాడుతూ.. యువతి తండ్రి సురేంద్ర సింగ్ షాక్‌కు గురయ్యాడనీ, పొత్తి కడుపులో గాయాల కారణంగా చనిపోయి ఉండొచ్చని తెలిపారు.
సిట్ ఏర్పాటు..
గత ఆదివారం నుంచి జరుగుతున్న ఈ మొత్తం వ్యవహారాన్ని దర్యాప్తు చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)ను ఏర్పాటు చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఘటనపై బుధవారం సాయంత్రానికల్లా ప్రాథమిక నివేదిక సమర్పించాలని చెప్పారు. ఈ మేరకు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(లక్నో జోన్) నేతృత్వంలో ఏర్పాటైన సిట్‌లో క్రైం బ్రాంచ్ ఎస్పీ, మహిళా డీఎస్పీ సభ్యులుగా ఉంటారని లా అండ్ ఆర్డర్ ఏడీజీ ఆనంద్ కుమార్ తెలిపారు.
సీబీఐతో దర్యాప్తుకై సుప్రీంలో పిల్..
కాగా, ఉనావో అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో బుధవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అధికార పార్టీ అండ దండలతోనే యువతి తండ్రిని కొట్టి చంపారని అడ్వకేట్ మనోహర్ లాల్ శర్మ తన పిల్‌లో పేర్కొన్నారు. యువతిపై ఎమ్మెల్యే, అతని సోదరుడి అత్యాచారం, ఆమె తండ్రి మృతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన సుప్రీం కోర్టును అభ్యర్థించారు.
Comments
Please login to add a commentAdd a comment