
ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ (ఫైల్ ఫోటో)
లక్నో: ఉనావో అత్యాచార ఘటనకు సంబంధించి సీబీఐ మంగళవారం మరో వ్యక్తిపై కేసు నమోదు చేసింది. తన ఎఫ్‌ఐఆర్‌లో శశి సింగ్ కుమారుడు శుభం సింగ్‌ను నిందితునిగా చేర్చింది. శశి సింగ్ బాధిత యువతిని ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ నివాసానికి తీసుకెళ్లిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె కుమారుడు శుభం సింగ్‌కు ఈ ఘటనతో సంబంధం ఉందని సీబీఐ అభియోగాలు మోపింది. అత్యాచార బాధితురాలిని ఘటనా స్థలానికి చేర్చడంలో శుభం సింగ్ ప్రమేయం కూడా ఉందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. విచారణ నిమిత్తం మంగళవారం శుభం సింగ్‌ను అరెస్టు చేసింది.
‘ప్రలోభాలకు గురిచేసి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ ఇంటికి శశి సింగ్ నా కూతురుని తీసుకెళ్లింది. ఎమ్మెల్యే అఘాయిత్యం చేస్తున్న సమయంలో శశి గేటు కాపలాగా ఉంద’ని అత్యాచార బాధిత యువతి తల్లి సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కాగా, సీబీఐ ఆదివారం శశి సింగ్‌కు 4 రోజుల కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. బాధిత యువతి మైనర్ కాదనే గందరగోళం తలెత్తడంతో మరోసారి ఆమె వయసు నిర్ధారణకు యువతిని శనివారం లక్నోలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఘటన చోటుచేసుకునే నాటికి ఆమె మైనర్ కాదని తేలితే.. పోక్సో చట్టం (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్ర్డన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) కింద ఎమ్మెల్యేపై మోపిన కేసుల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment