
రోదిస్తున్న మృతుడు తల్లి షబీనాకౌసర్, మృతుడు దూదేకుల షోయబ్ అక్మల్
ఇష్టం లేని ఇంజినీరింగ్ కోర్సులో ఆ విద్యార్థి ఇమడలేకపోయాడు. తోటి విద్యార్థులతో కలిసి చదువులో పోటీపడలేకపోయాడు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చలేకతున్నానని మదనపడ్డాడు. తనలో తానే కుంగిపోయాడు. తిండీ తిప్పలు మానేశాడు. దినచర్యలో భాగంగా వాకింగ్‌కని వెళ్లి అర్ధంతరంగా తనువు చాలించాడు.
అనంతపురం ,పామిడి :పామిడిలో బీటెక్ విద్యార్థి బుధవారం రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గుత్తి రైల్వే హెడ్‌కానిస్టేబుల్ ఇ.శ్రీరాములు నాయక్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పామిడికి చెందిన దూదేకుల హŸన్నూర్‌సాబ్, షబీనాకౌసర్ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు డి.షోయబ్ అక్మల్(18) తాడిపత్రి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్‌లో ఈసీఈ ప్రథమ సంవత్సరం చదువుతన్నాడు. ఎంత చదివినా బుర్రకెక్కకపోవడంతో కోర్సు పూర్తి చేయడం కష్టమని భావించాడు. ఒంటరిగా గడిపేవాడు.. వేళకు భోజనం చేసేవాడు కాదు. తల్లిదండ్రులకు విషయం తెలిసి వేళకు భోజనం చేయాలంటూ పలుమార్లు సూచించారు. అయినప్పటికీ అతనిలో మార్పు లేకపోయింది. దసరా సెలవులు ఇవ్వడంతో ఇటీవలే పామిడికి వచ్చాడు.
వచ్చినప్పటి నుంచి కూడా మానసికంగా బాధపడుతున్నాడు. కుమారుడి ఆరోగ్యం కుదుట పడాలని బుధవారం నార్పల మండం గూగూడు కుళ్లాయిస్వామి దర్శనానికి వెళ్లాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. దినచర్యలో భాగంగా ఉదయాన్నే అక్మల్ వాకింగ్‌కని వెళ్లాడు. కొద్దిసేపటికే రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఛిద్రమైన కుమారుడి మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయారు. ‘నాయనా... అప్పుడే నీకు నూరేళ్లు నిండెనా... ఎంత పనిచేశావు నాయనా...’ అంటూ రోదించడం చూపరులను కంటతడి పెట్టింది. చేతికొచ్చిన కొడుకు దూరమవ్వడంతో వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. సంఘటనా స్థలంలోనే గుత్తి రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములు నాయక్, కానిస్టేబుల్ నారాయణస్వామి సమక్షంలో ప్రభుత్వ వైద్యులు మమత, రాధారాణిలు మృతదేహానికి పంచనామా నిర్వహించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.