
రమేష్ (ఫైల్)
కాంచీపురం: ‘‘ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, పోలీసు కమిషనర్ ఏకే విశ్వనాథన్ దండగ నా చావుతోనే పోలీసుల ఆగడాలు ఆగిపోవాలి.. లేకుంటే దయచేసి ప్రజా పాలన ఇవ్వండి.. వాళ్లే పాలన చేసుకుంటారు..’’ ఈ మాటలు ఎవరో ప్రతిపక్ష నేత చెప్పినవి కావు. పోలీసుల వేధింపులకు తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఒక కాల్ ట్యాక్సీ డ్రైవర్, ఆత్మహత్యకు ముందు తన సెల్‌ఫోన్‌లో మాట్లాడిన మాటలు.. ఈ హృదయ విదారక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కాంచీపురం సమీపంలోని కమ్మవర్ గ్రామానికి చెందిన మూర్తి కుమారుడు రాజేష్ (25) చెన్నైలో ఉన్న ప్రముఖ సంస్థలో డ్రైవర్‌గా కారును నడుపుతున్నాడు. ఇతను పాడి సిగ్నల్ వద్ద నుంచి అన్నానగర్‌కు వెళ్లే మార్గంలో మొదటి కూడలి వద్ద ఇద్దరు పోలీసులు అధికారులు వాహనాన్ని నిలపకూడదని దుర్భాషలాడి, వాహనాన్ని ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన డ్రైవర్ చెన్నై సమీపంలోని మరైమలై నగర్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై తలను పెట్టి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. అయితే రమేష్ తాను ఆత్మహత్య చేసుకోవడానికి ముందే తన సెల్‌ఫోన్‌లో వాంగ్మూలం నమోదు చేసి ఉన్నాడు. అయితే దీన్ని తెలుసుకున్న పోలీసులు ఆధారాలను నాశనం చేసి, సెల్‌ఫోన్‌ను మాత్రమే రమేష్ కుటుంబీకులకు అప్పగించారని తెలిసింది. రమేష్ మృతి పట్ల కుటుంబీకులు సందేహం వ్యక్తం చేసి రమేష్ సెల్‌ఫోన్‌ను పరిశీలించగా, అందులో ఏమీ లేదు. అయినప్పటికీ వారు అంతటితో ఆగక ఆ సెల్‌ఫోన్‌లో డేటాను రికవరీకి పంపించారు. ఈ క్రమంలో దిగ్భ్రాంతి కరమైన రమేష్ వాంగ్మూలం వీడియో గురువారం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యి సంచలనం రేపుతోంది.
ఆ వీడియోలో రమేష్ మాట్లాడుతూ.. ‘‘గత నెల 25వ తేదీ ఉదయం 7 గంటల సమయంలో మొదటి పికప్ డీఎల్‌ఎఫ్ ఐటీ వద్ద మహిళా ఉద్యోగిని ఎక్కించుకుని, మరో ఉద్యోగిని పికప్ చేసుకోవడానికి వేచి ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు పోలీసులు నా వాహనంపై కర్రతోనే, చెత్తోనో తెలియదు.. కొట్టారు. తర్వాత నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. దీంతో అక్కడి నుంచి బయలుదేరి వెళ్లగా, మళ్లీ 100 అడుగుల రోడ్డులో మరో పోలీసు వాహనంపై కర్రతో బాది నోటికి వచ్చినట్లు దుర్భాషలాడాడు. మహిళా ఉద్యోగిని ఉందనే ఇంగితం కూడా లేకుండా బూతులు తిట్టాడు. ఎక్కడికి వెళ్లినా వీళ్ల ఆగడాలు తటుకోలేకపోతున్నాం. ప్రతిరోజూ ఉదయం మేల్కొంటే పడుకోవడానికి రాత్రి 1.30, 2.00 గంటలు అవుతుంది. మళ్లీ వేకువనే మేల్కొవాలి.
రోజుకు మూడున్నర గంటలు మాత్రమే డ్రైవర్లకు నిద్ర. ఇలా డ్రైవర్లు ప్రతి రోజూ దినదిన గండంగా చచ్చి బతుకుతున్నారు. ఇలా బతుకుతుంటే మామూళ్ల కోసం పోలీసుల ఆగడాలు తట్టుకోలేకున్నాం. పోలీసులుగా ఉండి ఈ విధంగా చేయవచ్చా. జనం తప్పు చేస్తే అడిగే పోలీసులే తప్పు చేయవచ్చా. వారిని శిక్షించడానికి చట్టంలో స్థానం లేదా. నిజంగా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, పోలీసు కమిషనర్ ఏకే.విశ్వనాథన్ దండగ. ఇటీవల తరమణిలో ఒక డ్రైవర్ చనిపోయాడు. నేరస్తులను ఏమి చేశారు అని అడిగితే అధికారులను బదిలీ చేశాం అని అంటున్నారు. అలా చేశాం.. ఇలా చేశాం కాదు. మళ్లీ అదే తంతు.. మామూళ్ల కోసం పోలీసుల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి కాదా మళ్లీ ఇటువంటిది జరిగితే మీరు అవసరం లేదు. ప్రజాపాలన పెట్టండి, ప్రజలే పాలన చేసుకుంటారు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.