సాక్షి, గుంటూరు/ హైదరాబాద్: జాతీయ బ్యాంకులకు రూ.వందల కోట్లలో రుణాల ఎగవేతకు సంబంధించి టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తదితరులపై సీబీఐ అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాయపాటికి చెందిన పలు ప్రాంతాల్లోని నివాసాలు, ఆఫీసుల్లో సీబీఐ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, గుంటూరు తదితర చోట్ల ఈ సోదాలు జరిగాయి. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు...హైదరాబాద్ కావూరి హిల్స్‌లోని ట్రాన్స్‌ట్రాయ్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శ్రీధర్‌తోపాటు డైరెక్టర్, ప్రమోటర్ చైర్మన్‌గా ఉన్న రాయపాటి సాంబశివరావు, ఇండిపెండెంట్ నాన్–ఎగ్జిక్యూటివ్ అడిషనల్ డైరెక్టర్ సూర్యదేవర శ్రీనివాస బాబ్జి, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు చెందిన కొందరు ఉద్యోగుల పేర్లను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో జాబితాలో చేర్చింది. జాతీయ బ్యాంకులకు రుణాల ఎగవేతకు సంబంధించి 120 బి, రెడ్‌విత్ 420, చీటింగ్, 406, 468, 477ఏ తదితర సెక్షన్ల కింద సీబీఐ కేసులు నమోదు చేసింది. తమ వద్ద తీసుకున్న రుణాన్ని ఇతర ఖాతాలకు మళ్లించారంటూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ప్రాంతీయ విభాగాధిపతి ఎస్.కె భార్గవ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ రంగంలోకి దిగింది.
బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా మళ్లింపు
ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ తనకిచ్చిన క్రెడిట్ లిమిట్స్‌ను వాడుకుని మోసానికి పాల్పడినట్లు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. తొలుత తనకిచ్చిన క్రెడిట్ లిమిట్‌ని రూ.50 కోట్ల నుంచి రూ.81 కోట్లకు పెంచుకుంది. లెటర్ ఆఫ్ గ్యారంటీ పరిమితిని రూ.100 కోట్ల నుంచి రూ.234 కోట్లకు, లెటర్ గ్యారెంటీ లిమిట్‌ను రూ.35 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు పెంచుకుంది. ఆంధ్రాబ్యాంకు, యూకో, యూనియన్ బ్యాంక్ తదితర 14 బ్యాంకులతో కూడిన కన్సార్టియానికి కెనరా బ్యాంక్ లీడ్ బ్యాంకుగా వ్యవహరించింది. వివిధ క్రెడిట్ లిమిట్స్ నుంచి రూ.264 కోట్లకుపైగా ట్రాన్స్‌ట్రాయ్ వేరే ఖాతాలకు మళ్లించిందని, బ్యాంకులకు రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైందని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది.
హైదరాబాద్ నుంచి లాకర్ తాళాలు తెప్పించి...
గుంటూరు లక్ష్మీపురం నాలుగో లైన్‌లోని రాయపాటి నివాసానికి మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటలకు చేరుకున్న పది మంది సీబీఐ అధికారుల బృందం ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు జరిపి పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకుంది. రాయపాటి నివాసంలో రెండు లాకర్‌లు ఉండగా తొలుత మొదటి లాకర్ తనిఖీ చేశారు. రెండో లాకర్ తాళాలు హైదరాబాద్‌లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొనడంతో తెప్పించాలని అధికారులు సూచించారు. అనంతరం రెండో లాకర్ కూడా తెరిచి అందులోని డాక్యుమెంట్లను పరిశీలించారు. రాయపాటి కుమారుడు రంగబాబుతోపాటు కుటుంబ సభ్యులను కూడా సీబీఐ అధికారులు విచారించారు. తమ ఇంట్లో డబ్బులు, వజ్రాలతోపాటు ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీకి, బ్యాంకులకు మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించిన పత్రాలు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు సోదాలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారని అయితే ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీతో ప్రస్తుతం తమకు ఎలాంటి సంబంధం లేదని రంగబాబు పేర్కొన్నారు. తన తల్లి జీవించి ఉన్నప్పుడు మాత్రమే ట్రాన్స్‌ట్రాయ్‌లో భాగస్వామ్యం ఉన్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment