
సాక్షి, లక్నో: ఉన్నావ్ లైంగిక దాడిపై సీబీఐ విచారణను స్వాగతిస్తానని బాధితురాలు పేర్కొన్నారు. పోలీసు కస్టడీలో తన తండ్రిని హతమార్చిన తర్వాత సైతం తనపై పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. సీబీఐ విచారణ మంచిదే..అయితే ముందు ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను అరెస్ట్ చేయాలి..లేకుంటే ఆయన విచారణను ప్రభావితం చేస్తారని అన్నారు.
తన కోసం పోరాడుతున్న తన బాబాయి జీవితం గురించి ఇప్పుడు తాను భయపడుతున్నానని ఆమె చెప్పారు. తనపై బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్, ఆయన సోదరుడు లైంగిక దాడికి పాల్పడ్డారని వారిపై చర్యలు చేపట్టాలని కోరుతూ ఆమె యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ నివాసం ఎదుట ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో సెంగార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే ఆయన అరెస్ట్‌పై ఓ ప్రముఖుడు ఫోన్ చేయడంతో సీఎం వెనకడుగువేశారని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఐపీ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.