
కోర్టుకు హాజరైన నటి శ్రుతి
తమిళసినిమా: నటి శ్రుతి బెయిల్ పిటిషన్‌ను కోవై కోర్టు కొట్టివేసింది. కోవై, పాపనాయగన్ పాళైయం, ధనలక్ష్మీనగర్‌కు చెందిన నటి శ్రుతి(21) ప్రేమ, పెళ్లి పేరుతో పలువురు యువకుల నుంచి కోట్లాది రూపాయలను గుంజి మోసానికి పాల్పడిన విషయం తెలిసిందే. అదే విధంగా ఎడపాడి గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బాలకుమార్‌ను పెళ్లి పేరుతో రూ.45 లక్షలు మోసానికి పాల్పడడంతో అతను కోవై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నటి శ్రుతి, ఆమె తల్లి చిత్ర, సోదరుడు సుభాష్, సహయకుడు ప్రసన్న వెంకటేశ్‌లను అరెస్ట్ చేసి కోవై సెంట్రల్ జైలుకు పంపారు. నటి శ్రుతితో పాటు నలుగురు బెయిల్‌ను మంజూరు చేయవలసిందిగా కోవై జేఎం.కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన న్యాయమూర్తి వేల్‌స్వామి ఆ నలుగురికి బెయిల్‌ను మంజూరు చేయడానికి నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేశారు.