నిర్లక్ష్యం ఖరీదు 10 హత్యలు | Cyanide Killings New Twists in Serial Killer Shiva case | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం ఖరీదు 10 హత్యలు

Published Fri, Nov 8 2019 10:36 AM | Last Updated on Fri, Nov 8 2019 10:36 AM

Cyanide Killings New Twists in Serial Killer Shiva case - Sakshi

నిందితుడు సింహాద్రి, సైనేడ్‌ ఇచ్చి సహకరించిన షేక్‌ అమీనుల్లా (ఇన్‌సెట్‌లో సింహాద్రి)

ప్రతిచిన్న అంశాన్నీ బూతద్దంలో చూడటం.. అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తిని విచారించడం.. అతనిపై నిఘా పెట్టడం.. అవసరమైతే నయానో భయానో నిజం రాబట్టడం.. పోలీసుల నిత్యకృత్యం. అయితే సైనైడ్‌ కిల్లర్‌ సింహాద్రి విషయంలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఫలితంగా పది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. బాధితులే కిల్లర్‌ ఇల్లు చూపించినా పోలీసులు పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులను కూడా కిల్లర్‌ తనకు అనుకూలంగా మార్చుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సైనైడ్‌ కిల్లర్‌ను ప్రస్తుత పోలీసులు చాకచక్యంగా పట్టుకోగా.. గతంలో ఉన్న పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సాక్షి, ఏలూరు టౌన్‌: ప్రసాదంలో సైనైడ్‌ పెట్టి వరుస హత్యలతో రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన సీరియల్‌ కిల్లర్‌ సింహాద్రి అలియాస్‌ శివ కేసులో విస్మయం కలిగించే వాస్తవాలు ఆలస్యంగా వెలుగుచూస్తున్నాయి. హత్యల విచారణలో పోలీసుల తీవ్ర నిర్లక్ష్యం హత్యల పరంపరకు తోడ్పడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏలూరులో ఫైనాన్స్‌ కంపెనీ గుమస్తా చోడవరపు సూర్యనారాయణ హఠాత్తుగా మృతిచెందాడు. ఇది కిల్లర్‌ సింహాద్రి చేసిన ఐదో హత్య. ఇది హత్యేనని సూర్యనారాయణ కుటుంబసభ్యులు, బంధువులు పోలీసులకు ఎంత చెప్పినా పట్టించుకోలేదు. ఇదే అదనుగా కిల్లర్‌ సింహాద్రి మరో ఐదు ప్రాణాలు బలితీసుకున్నాడు.
  

చదవండి : సైనైడ్ ప్రసాదం: సీరియల్ కిల్లర్ కేసులో కొత్త కోణాలు

బంధువునని నమ్మించి.. 
ఏలూరు వన్‌టౌన్‌ వంగాయగూడెం నీరజ్‌కాలనీలో నివాసం ఉండే చోడవరపు సూర్యనారాయణ అలియాస్‌ సూరిబాబు ఫైనాన్స్‌ కంపెనీలో గుమస్తా. దగ్గర బంధువుని అంటూ కిల్లర్‌ సింహాద్రి పరిచయం చేసుకుని బావా అంటూ పిలుస్తూ చనువుగా ఉండేవాడు. సూరిబాబు వద్ద పెద్ద మొత్తంలో సొమ్ములు ఉండటాన్ని సింహాద్రి గమనించి డబ్బులు రెట్టింపు చేస్తానంటూ ఆశజూపించాడు. 2018 ఏప్రిల్‌ 14న వంగాయగూడెంలోని బాలాజీ స్కూల్‌ వద్దకు రప్పించి, సైనైడ్‌ కలిపిన ప్రసాదం తినిపించి హత్య చేశాడు. రూ.5 లక్షల నగదు, రెండు బంగారు ఉంగరాలను దోచేశాడు.

రెండో హత్యతోనే ఆగేది! 
కృష్ణా జిల్లా నూజివీడు మండలం మర్రిబంద గ్రామానికి చెందిన పులపు తవిటయ్యను 2018 మార్చి 2న సింహాద్రి హతమార్చాడు. సింహాద్రి హత్యల పరంపరలో ఇది రెండోది. డబ్బులు రెట్టింపు చేస్తానని నమ్మించి ప్రసాదంలో సైనైడ్‌ పెట్టి తినిపించి హత్య చేసి, రూ.8 లక్షలతో ఉడాయించాడు. మృతుడి బంధువులు తొలుత గుండెపోటుగా భావించినా తవిటయ్య వద్ద డబ్బు లేకపోవటంతో అనుమానం వచ్చింది. సింహాద్రిపై ఫిర్యాదు చేయగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని రూ.8 లక్షల నగదు వెనక్కి ఇప్పించి సెటిల్‌మెంట్‌ చేశారనే అపవాదు ఉంది. ఫిర్యాదు వచ్చినా పోలీసులు కేసు నమోదు చేయలేదు, సింహాద్రిని అరెస్ట్‌ చూపలేదు. అప్పుడే పూర్తిస్థాయిలో విచారణ చేసి ఉంటే మరో ఎనిమిది ప్రాణాలను కాపాడి ఉండేవారు.
 
8వ హత్యలోనూ వైఫల్యమే..
రాజమండ్రి బొమ్మూరుకు చెందిన వరుసకు వదిన సామంతకుర్తి నాగమణి హత్యలోనూ పోలీసులు ఇదే తరహాలో సింహాద్రిని విచారణ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. నాగమణిని డబ్బులు రెట్టింపు చేస్తానంటూ నమ్మించటంతో ఆమె కొందరు వ్యక్తుల వద్ద అప్పు చేసిన తెచ్చిన రూ.5 లక్షలు, ఒంటిమీద బంగారు నగలు తీసుకుని సింహాద్రి పరారయ్యాడు. నాగమణి హత్య అనంతరం పోలీసులకు సింహాద్రిపై అనుమానం వ్యక్తం చేస్తూ విచారించమని చెప్పినా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. పైగా నాగమణికి అప్పులు ఇచ్చిన వ్యక్తిపై హత్య నేరం మోపేందుకు సైతం సింహాద్రి పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
 
రాములమ్మ కుమారుడి ఫిర్యాదు 
సీరియల్‌ కిల్లర్‌ సింహాద్రిపై ఏలూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది. ఏలూరు హనుమాన్‌నగర్‌లో సింహాద్రి అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని రాములమ్మను ప్రసాదంలో సైనైడ్‌ కలిపి హత్య చేసి, ఆమె ఒంటిపై బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. రాములమ్మ ఇంటి మొదటి అంతస్తులో అద్దెకు ఉంటూ సింహాద్రి హత్యకు పాల్పడ్డాడు.తండ్రి విజయవాడ కుమారుడి వద్దకు వెళ్లిన రోజు ఎవరూ లేకపోవటంతో ఇదే అదనుగా సైనైడ్‌ పెట్టి హత్య చేసినట్లు కుమారుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఐదు ప్రాణాలు దక్కేవి?  
ఏలూరు వంగాయగూడెం నీరజ్‌కాలనీకి చెందిన చోడవరపు సూర్యనారాయణ అలియాస్‌ సూరిబాబు అనే వ్యక్తి సీరియల్‌ కిల్లర్‌ సింహాద్రి హత్యల చిట్టాలో ఐదో వ్యక్తి. సూరిబాబు 2018 ఏప్రిల్‌ 14న రాత్రి 9 గంటల సమయంలో బాలాజీ స్కూల్‌ వద్ద విగతజీవిగా పడి ఉన్నాడు. తొలుత గుండెపోటుగా భావించిన కుటుంబ సభ్యులకు సింహాద్రిపై అనుమానం వచ్చింది. సూరిబాబు వద్ద రూ.5 లక్షల నగదు, బంగారు ఉంగరాలు లేకపోవటంతో అనుమానం మరింత పెరిగింది. ఏలూరు వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు కోసం కూడా ఆరు నెలలు పోలీసుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని వాపోతున్నారు. సుమారుగా 15 నెల లు పోలీసుల చుట్టూ తిరిగినా, అనుమానితుడు సింహాద్రి ఇంటిని చూపించినా పో లీసులు పట్టించుకోలేదని అంటున్నారు.

ఒక్కసారీ విచారించలేదు 
నా భర్త సూరిబాబు చనిపోతే గుండెపోటు అనుకున్నాం. డబ్బులు, బంగారు ఉంగరాలు లేకపోతే అను మానం వచ్చింది. వెల్లంకి సింహాద్రిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాం. సింహాద్రి ఎన్‌టీఆర్‌ కాలనీలో చర్చికి వెళతాడనీ, అక్కడే ఒక ఇంట్లో ఉంటాడని పోలీసులకు చెప్పడంతో పాటు మా బంధువులు వెళ్లి చూపించారు. అయినా సింహాద్రిని ఒక్కసారి కూడా పోలీసులు విచారించలేదు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల సింహాద్రి అప్పట్లో తప్పించుకున్నాడు. మా కుటుంబం చాలా కష్టాల్లో ఉంది. న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నా.  
–సత్యవతి, మృతుడు సూరిబాబు భార్య, ఏలూరు 

పోలీసులు నిర్లక్ష్యం వహించారు 
మా బాబాయ్‌ సూరిబాబు చనిపోయిన తర్వాత సింహాద్రిపై అనుమానం వ్యక్తం చేశాం. అతడిని విచారించాలని పలుమార్లు మొత్తుకున్నాం. 15 నెలల పాటు పోలీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ఆ రోజు రాత్రి 8.40 నిమిషాల వరకూ మాతో మాట్లాడిన సూరిబాబు హఠాత్తుగా చనిపోవటం, డబ్బులు, బంగారం లేకపోవటంతో మాకు సింహాద్రిపై అనుమానం వచ్చింది. అతని ఇల్లు కూడా చూపించినా పోలీసులు పట్టించుకోలేదు. సూరి బాబు పనిచేసే ఫైనాన్స్‌ కంపెనీకి సింహాద్రి పలుమార్లు వచ్చేవాడని ఫైనాన్స్‌ వాళ్లు కూడా చెప్పారు.  
–ప్రసాదు, మృతుడు సూరిబాబు బంధువు, ఏలూరు 

పోలీస్‌ కస్టడీకి కోరాం 
పది హత్యల నిందితుడు వెల్లంకి సింహాద్రిని ఇంకా పూర్తిస్థాయిలో విచారణ చేసేందుకు పోలీస్‌ కస్టడీ కోరుతూ కోర్టుకు వినతి చేశాం. సింహాద్రి ఈ జిల్లాలోనే కాకుండా కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ హత్యలకు పాల్పడ్డాడు. హత్యల వెనుక కారణాలు ఏమిటనేది విచారణ చేసి తెలుసుకుంటాం. ఇప్పటి వరకూ పోలీసులకు ఫిర్యాదు చేయని మృతుల బంధువుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, కేసులు నమోదు చేసేందుకు చర్యలు చేపడతాం. కొందరు గుండెపోటుతో మృతిచెందారని భావించిన మృతుల కుటుంబ సభ్యులు ఫిర్యాదులు చేయలేదు.  
–డాక్టర్‌ ఓ.దిలీప్‌కిరణ్, ఏలూరు డీఎస్పీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement