
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు బాబీ మద్యం మత్తులో తమ కారును ఢీకొట్టి, పరారయ్యాడని ఓ నెటిజన్ సామాజికమాధ్యమం ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. శుభకార్యానికి వెళ్లి కుటుంబంతో తిరిగి వస్తుండగా తమ కారును దర్శకుడు బాబీ(కే.ఎస్. రవీంద్ర) ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టిందని అమీర్‌పేటకు చెందిన యువ వ్యాపారి హర్మీందర్‌సింగ్ పేర్కొన్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఐ 10 కారు(టీఎస్ 08 ఈజే 1786)లో అయ్యప్ప సొసైటీలో ఓ శుభకార్యానికి వెళ్లి అర్ధరాత్రి తిరిగి బయలు దేరామని తెలిపారు.
జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 33లోని కేఫ్ అబ్బాట్ వద్దకు రాగానే అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొని వస్తున్న దర్శకుడు బాబీ ప్రయాణిస్తున్న ఎరుపు రంగు వోల్వో కారు వెనుక నుంచి వచ్చి వేగంగా ఢీకొట్టిందని హర్మీందర్‌సింగ్ చెప్పారు. ఈ ఘటనలో తమ కారు ధ్వంసమైందన్నారు. ఆ సమయంలో బాబీ మద్యం సేవించి ఉన్నారని హర్మీందర్‌సింగ్ ఆరోపించారు. దీనిపై హర్మిందర్ సింగ్ నిలదీయగా, తన ఇల్లు ఇక్కడే ఉందని మాట్లాడుకుందామంటూ మద్యం మత్తులో ఉన్న బాబీ చెప్పి క్షణాల్లో అక్కడి నుంచి ఉడాయించాడన్నారు. అంతపెద్ద తప్పు చేసి కూడా కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా అక్కడి నుంచి పరారయ్యాడని తెలిపారు. బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment