
సాక్షి, సిటీబ్యూరో: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలని నగర పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు అధికారులకు సూచించారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లోని కమిషనర్ కార్యాలయంలో ఇందుకు సంబందించి విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. అదనపు పోలీస్ కమిషనర్ స్వాతి లక్రా, సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతితో పాటు ఐదు జోన్ల డీసీపీలు, 17 డివిజన్ల ఏసీపీలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ కేసులను జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ నిత్యం సమీక్షిస్తూ ఉంటుంది.
అయితే ఈ సమీక్ష విధానాన్ని కమిషన్ పూర్తి స్థాయిలో మార్చి ప్రత్యేక ఫార్మాట్‌ను రూపొందించింది. ఇటీవల నగరంలో జరిగిన కమిషన్ పర్యటన నేపథ్యంలో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. దీనిని పరిగణలోకి తీసుకున్న కొత్వాల్ అదే ఫార్మాట్‌ను ప్రతి అధికారి అనుసరించాలని, ఆ మేరకే రివ్యూ రిపోర్ట్స్ తయారు చేయాలన్నారు. ఈ కేసులను డీఎస్పీ హోదాలో ఉండే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు (ఏసీపీ) అధికారులు దర్యాప్తు చేస్తుంటారు. వీరి దర్యాప్తు తీరుతెన్నుల్ని డీసీపీలు పర్యవేక్షిస్తారు. ఈ నేపథ్యంలోనే వీరితో పాటు సీసీఎస్ అధికారులతోనూ పోలీసు కమిషనర్ భేటీ అయ్యారు.