స్టీరింగ్‌లోనే ఇరుక్కుని మృతి చెందిన లగేజీ ఆటో డ్రైవర్ చాంద్‌పీరా
‘తెలవారుతోంది. మార్కెట్ మొదలైపోయుంటుంది. సమయానికి సరుకు అందించాలి.. లేకపోతే సరుకంతా నిలిచి నష్టమొస్తుంది’ అని మార్కెట్‌కు తొందరగా చేరుకోవాలని లగేజీ ఆటో వేగం పెంచాడు. అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నాడు. మితిమీరిన వేగం ఆ డ్రైవర్ బతుకు తెల్లారిపోయేలా చేసింది.
గుంతకల్లు: గుంతకల్లు పట్టణ శివార్లలోని వేర్‌హౌస్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ దుర్మరణం చెందాడు. ఈ ఘటనలోనే మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలోని మారుతీనగర్ నివాసి చాంద్‌పీరా (43) లగేజ్ ఆటో డ్రైవర్. చిత్రదుర్గలో పండిన పచ్చి మిరపను గుత్తి మార్కెట్‌యార్డుకు తరలించడానికి అర్ధరాత్రి 2.00 గంటల ప్రాంతంలో బయలుదేరాడు. సకాలంలో మార్కెట్‌కు చేరుకోవాలన్న ఆతృతతో ఆటో వేగాన్ని పెంచాడు.
నెల్లూరు – అంకోలా జాతీయ రహదారిలో నాలుగు రోడ్ల పనులు జరుగుతున్న దృష్ట్యా వన్‌వేలో వాహన రాకపోకలు సాగుతున్నాయి. చాంద్‌పీరా అతి వేగంతో గుంతకల్లు నుంచి వస్తున్న లారీని బళ్లారి రోడ్డులోని వేర్‌హౌస్ వద్ద బలంగా ఢీకొన్నాడు. ఈ ఘటనలో లగేజ్ ఆటో ముందు భాగం నుజ్జునుజ్జు అయి స్టీరింగ్ చక్రం మెడకు చుట్టుకొని ఊపిరాడక అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. లారీడ్రైవర్ మహమ్మద్ ఇక్బాల్ (గుంతకల్లు) తలకు తీవ్రమైన గాయాలై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతం వజ్రకరూరు పరిధిలోకి రావడంతో వజ్రకరూరు ఎస్‌ఐ ఇబ్రహీం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు చాంద్‌పీరా భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment