కృష్ణాజిల్లా, మచిలీపట్నం: జిల్లాలోని చందర్లపాడు మండల కేంద్రంలో ఉన్న హైస్కూల్‌లో ఇంగ్లిషు టీచర్‌గా పని చేస్తున్న డీ శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తున్నట్లుగా డీఈవో ఎంవీ రాజ్యలక్ష్మి ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే... విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు విద్యార్థినులకు అసభ్యకర మెసేజ్‌లు పెడుతున్నాడు. కొన్నాళ్లుగా ఇదే తంతు కొనసాగుతుండటంతో సహనం నశించిన విద్యార్థినులు సమస్యను తల్లిదండ్రులకు వివరించారు. దీంతో వారు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయటంతో పాటు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రంగప్రవేశం చేసిన జిల్లా విద్యా శాఖాధికారులు చర్యలకు ఉపక్రమించారు.
విద్యా వ్యవస్థకు మచ్చ తెచ్చే రీతిలో వ్యవహరించిన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకునేందుకు డీఈవో రాజ్యలక్ష్మి సిద్ధమయ్యారు. ఈ మొత్తం వ్యహారంపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని నందిగామ డెప్యూటీ డీఈవో చంద్రకళను ఆదేశించారు. చందర్లపాడు ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు, తోటి ఉపాధ్యాయులను ఆమె విచారించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు నుంచి వివరాలు సేకరించారు. ఈ విచారణలో పదో తరగతి విద్యార్థినులకు టీచర్ తన సెల్ ద్వారా అసభ్యకరమైన వాట్సాప్ మెసేజ్‌లను పంపుతున్నట్లు వెల్లడయ్యింది. అంతే కాకుండా తన ఇంటి వద్ద ఉపయోగించే సెల్ నుంచి కూడా అసభ్యకర మెసేజ్‌లు పంపుతున్నట్లు తేలింది. ఈ మేరకు డీఈవోకు సమగ్ర నివేదికను అందజేశారు. దాని ఆధారంగా టీచర్‌పై డీఈవో రాజ్యలక్ష్మి సస్సెన్షన్ వేటు వేశారు. అంతేకాకుండా సదరు ఉపాధ్యాయుడు ముందస్తు అనుమతి లేకుండా మండల కేంద్రం విడిచి వెళ్లడానికి వీల్లేదని ఆదేశించారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని పాఠశాల హెచ్‌ఎంకి సూచిస్తూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment