
మారుతి సుజుకి మాజీ ఎండీ జగదీష్ ఖట్టర్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగు చూసిన రూ.110 కోట్ల కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బ్యాంకు రుణం విషయంలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ ఖట్టర్‌పై కేసు నమోదు చేసింది. తన కొత్త కంపెనీ కార్నేషన్ ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంక్ లోన్ మోసం కేసులో 110 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని తాజాగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో ఆరోపించింది.
మారుతి ఎండీగా రిటైరైన తరువాత, జగదీష్ ఖట్టర్ కార్నేషన్ ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 2009లో 170 కోట్ల రూపాయల రుణాన్ని పొందారు. ఆ తర్వాత 2012 వరకు కొంత మొత్తాన్ని చెల్లించారు. కానీ సుమారు 110 కోట్ల రూపాయల రుణాన్ని ఎగ్గొట్టారు. దీంతో 2015లో ఇది నిరర్ధక ఆస్తి (ఎన్‌పిఎ)గా మారింది. దీనిపై బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది.