
నిందితుడు ఎలీషా
నరసాపురం: గల్ఫ్‌లో ఉన్న భార్య తన జల్సాలకు డబ్బులు పంపించడంలేదని ఆగ్రహించి, తన ఇద్దరు కుమార్తెలను బెల్టుతో ఇష్టానుసారం కొడుతూ వీడియోలు తీసి భార్యకు పంపించి బ్లాక్ మెయిల్ చేశాడో కర్కోటకుడు. ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసులు అతణ్ని కటకటాల వెనక్కి పంపారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పెదసారవ గ్రామానికి చెందిన ఉల్లంపర్తి ఏలీజా పెయింటింగ్ పని చేస్తుండేవాడు. భార్య మహాలక్ష్మి ఏడాది క్రితం ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. కీర్తి (9) నాలుగో తరగతి చదువుతుండగా, మరియమ్మ (6) ఒకటో తరగతి విద్యార్థిని. మహాలక్ష్మి ప్రతీనెలా తన సంపాదనను భర్తకు పంపేది. ఆ సొమ్ముతో ఏలీషా 24 గంటలూ తాగుతూ జల్సాలు చేసేవాడు. విషయం తెలుసుకున్న మహాలక్ష్మి భర్తకు డబ్బులు పంపడం మానేసింది.
ఆగ్రహించిన ఏలీజా కుమార్తెలిద్దరిని స్కూల్‌కు పంపడం ఆపేశాడు. బెల్టు, సెల్ ఛార్జర్ వైరుతో ఇస్టానుసారం కొట్టేవాడు. పిల్లలను కొడుతున్న దృశ్యాలను వీడియోతీసి, భార్యకు పంపించి, డబ్బులు పంపకపోతే వారు శవాలుగా మారతారని బెదిరించాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నరసాపురం పోలీసులు కేసు నమోదు చేసి, ఏలీషాను అదుపులోకి తీసుకున్నారు. ఏలీషా సోదరి లక్ష్మి కూడా సహకరించి, వీడియో తీసినట్టుగా పిల్లలు చెప్పడంతో ఆమెపై కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత ఘటనపై స్పందించి నరసాపురం డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని పిల్లలతో మాట్లాడారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. పిల్లల సంరక్షణను ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment