
వివరాలు వెల్లడిస్తున్న సీపీ అంజనీ కుమార్
సాక్షి, సిటీబ్యూరో: కళాశాలల్లో హాజరు లెక్కింపునకు సంబంధించి జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జేఎన్టీయూ) అమలులోకి తీసుకువచ్చిన బయోమెట్రిక్ వ్యవస్థేనే ఏమార్చారు. ఓ మనిషికి సంబంధించిన వేలిముద్రలను క్లోనింగ్ చేసి, అతడు అక్కడ లేకున్నా అటెండెన్స్ పడేలా చేశారు. మరో ప్రాంతంలో చదువుతున్న విద్యార్థులు అదే కాలేజీలో ఉన్నట్లు చూపించి భారీ స్థాయిలో ఫీజు రీ–ఎంబర్స్‌మెంట్ చేసుకునేందుకు సహకరించారు. నగర శివార్లలోని వివేకానంద గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ కేంద్రంగా జరిగిన క్లోనింగ్ దందాను తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. పోలీసులకు చిక్కిన ముగ్గురిలో ఒక అసోసియేట్ ప్రొఫెసర్, మరో బీటెక్ గ్రాడ్యుయేట్ ఉండటం గమనార్హం. మరికొన్ని కళాశాలల్లోనూ ఇలాంటి వ్యవహారాలు జరిగినట్లు అనుమానాలు ఉన్నాయని, జేఎన్టీయూ సహకారంతో వాటిని గుర్తిస్తామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు.
అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్, ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాస్‌లతో కలిసి బుధవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన బొమ్మ రామకృష్ణ పీహెచ్‌డీ చేస్తూ ప్రస్తుతం అక్కడి స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. కృష్ణా జిల్లా కోడూరుకు చెందిన పి.శ్రీరామ్ ప్రసాద్ 2013లో బీటెక్ పూర్తి చేశాడు. 2014–17 మధ్య బాటసింగారంలోని నోవా ఇంజినీరింగ్ కాలేజీలో ఏఓగా పని చేశాడు. అప్పట్లో రామకృష్ణ సైతం కొన్నాళ్ల పాటు ఇదే కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేయడంతో వీరిరి పరిచయం ఏర్పడింది. నిబంధనల ప్రకారం ఇంజినీరింగ్ తదితర కాలేజీల్లో ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు తప్పనిసరిగా ఉండాలి. అయితే పలు కాలేజీలో దీనిని పాటించలేకపోతున్నాయి. ఫలితంగా బోగస్ అ«ధ్యాపకులు, విద్యార్థుల వ్యవహారాలు చోటు చేసుకున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న జేఎన్టీయూ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలులోకి తెచ్చింది. అఫిలియేటెడ్ కాలేజీల్లో విద్యార్థులు, సిబ్బంది హాజరు మొత్తం బయోమెట్రిక్ ఆధారంగానే జరుగుతుంది. ఆయా కాలేజీల్లోని బయోమెట్రిక్ మిషన్ జేఎన్టీయూలో ఉన్న సర్వర్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. దీంతో మేనేజ్‌మెంట్లు సిబ్బంది, విద్యార్థుల హాజరును ‘మేనేజ్’ చేయలేకపోయాయి. ఈ విషయాన్ని గుర్తించిన రామకృష్ణ ఇంటర్‌నెట్‌లో వేలిముద్రలను క్లోనింగ్ విధానంపై అవగాహన పెంచుకున్నాడు. శ్రీరామ్‌ప్రసాద్ ఇతడితో జట్టుకట్టాడు. హైదరాబాద్‌లో ఉన్న కాలేజీలతో ఒప్పందాలు చేసుకునే శ్రీరామ్ అవసరమైన ఫింగర్‌ప్రింట్స్ ఆర్డర్‌ను రామకృష్ణకు పంపిస్తాడు.
గ్లూ, ఈవీఏ వినియోగించి క్లోనింగ్...
ఆయా కాలేజీలు తమకు అవసరమైన విద్యార్థులు, అధ్యాపకుల డిమాండ్‌ను తట్టుకోవడానికి వక్రమార్గాలు అన్వేషిస్తున్నాయి. ఎంటెక్ పూర్తి చేసి, వేర్వేరు చోట్ల ఉద్యోగాలు చేస్తున్న వారిని గుర్తించి తమ వద్ద అసోసియేట్ ప్రొఫెసర్లుగా పని చేస్తున్నట్లు ఎన్‌రోల్ చేస్తున్నాయి. వీరికి ప్రతి నెలా రూ.5 వేల వరకు ‘గౌరవ వేతనం’ ఇస్తున్నాయి. ఈ ‘అసోసియేట్ ప్రొఫెసర్లు’ కేవలం ఒక్కసారి మాత్రమే ఆ కాలేజీకి వస్తారు. ఆ సందర్భంలో శ్రీరామ్ వారి వేలిముద్రలు బయోమెట్రిక్ మిషన్‌లో లోడ్ చేస్తాడు. దీంతో పాటు ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న చిన్న కాగితంపై గ్లూ గన్ ద్వారా సదరు ప్రొఫెసర్‌తో వేలిముద్ర వేయిస్తాడు. దీనిని అందుకుంటున్న రామకృష్ణ ఆ గ్లూ వేలిముద్రపై ఇథనైల్ వినైల్ ఎసిటేట్ (ఈవీఏ) అనే కెమికల్ వేసి, కొద్ది సేపటి తర్వాత చాకచక్యంగా ఆ అచ్చు తీస్తాడు. దీంతో గ్లూ పై ఉన్న వేలిముద్ర ఈ అచ్చు మీదికి చేరుకుంటుంది. వీటిపై నిర్ణీత నెంబర్లు వేసి శ్రీరామ్‌కు పంపిస్తాడు. ఒక్కో బోగస్ అధ్యాపకుడి సంబంధించి నాలుగు సెట్ల క్లోన్డ్ వేలిముద్రల్ని తయారు చేస్తారు. వీటిని అందుకుంటున్న ఆయా కళాశాలల యాజమాన్యాలు ప్రతి రోజూ ఈ అచ్చులను బయోమెట్రిక్ మిషన్‌లో వేలు పెట్టాల్సిన చోట పెడుతున్నాయి. దీంతో ఆ వ్యక్తి హాజరైనట్లు సర్వర్‌లో నమోదు అవుతోంది. అలాగే ఇతర యూనివర్శిటీలకు అనుబంధంగా ఉన్న కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులతోనూ కళాశాల యాజమాన్యాలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. వీరి వేలిముద్రలనూ ఇలానే తయారు చేసి, హాజరు చూపిస్తూ ఫీజు రీ–ఎంబర్స్‌మెంట్ పొందుతున్నాయి. ఈ వ్యవహారం మొత్తం ఆయా విద్యా సంస్థల్లోని కీలక వ్యక్తుల పర్యవేక్షణలో జరుగుతోంది. నిందితులు ఒక్కో వేలిముద్ర తయారు చేసి ఇచ్చినందుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు తీసుకుంటున్నారు.
29 మందివి సృష్టించినవివేకానంద సంస్థ...
బాటసింగారంలోని వివేకానంద గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ వైస్ ప్రిన్సిపల్ పోరెడ్డి సుదర్శన్‌రెడ్డి ఈ క్లోనింగ్ విషయాన్ని తమ కార్యదర్శి గోపాల్‌రెడ్డికి తెలిపారు. ఆయన సమ్మతించడంతో శ్రీరామ్ ద్వారా రామకృష్ణను సంప్రదించారు. తమ కళాశాల కోసం ‘ఏర్పాటు చేసుకున్న’ 29 మంది అసోసియేట్ ప్రొఫెసర్ల వేలిముద్రలను క్లోనింగ్ చేయించారు. ఏడాదిగా వీటి ద్వారానే తమ సిబ్బంది హాజరు చూపించేస్తున్నారు. తాజాగా మరో ఐదుగురు ప్రొఫెసర్ల వేలిముద్రల క్లోనింగ్ కోసం ఆర్డర్ ఇచ్చారు. వీటిని సైతం తయారు చేసిన రామకృష్ణ నేరుగా సిటీకి చేరుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఎస్సైలు గోవింద్ స్వామి, పి.రమేష్, జి.శ్రీనివాస్‌రెడ్డి, సి.వెంకటేష్‌లతో కూడిన ఈ టీమ్ బుధవారం సైదాబాద్ ప్రాంతంలో రామకృష్ణ, శ్రీరామ్‌లను పట్టుకుంది. వీరిచ్చిన సమాచారంతో సుదర్శన్‌రెడ్డినీ అదుపులోకి తీసుకుంది. వీరి నుంచి రూ.3 లక్షల నగదు, రెండు బయోమెట్రిక్ మిషన్లు, 29 క్లోన్డ్ వేలిముద్రలు, మరో 20 మందికి చెందిన ‘గ్లూ వేలిముద్రలు’ తదితరాలు స్వాధీనం చేసుకుంది. తదుపరి చర్యల నిమిత్తం ఈ కేసును సైదాబాద్ పోలీసులకు అప్పగించారు.
లోతుగా దర్యాప్తు
‘ఈ నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని యోచిస్తున్నాం. వీరి సహకారంతో ఇలాంటి వ్యవహారాలు మరికొన్ని కాలేజీల్లోనూ జరిగినట్లు అనుమానాలు ఉన్నాయి. అయితే కేవలం వివేకానంద సంస్థకు సంబంధించి మాత్రమే ఆధారాలు లభించాయి. ఈ కేసులో జేఎన్టీయూ సహకారం తీసుకుని లోతుగా దర్యాప్తు చేస్తాం. పాత్ర ఉన్న అన్ని కళాశాలల వివరాలుగుర్తిస్తాం’ –అంజనీకుమార్,నగర పోలీస్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment