సాక్షి : పాఠాలు చెప్పే మాష్టార్లు విద్యార్థులను దండించటం మాట ఎటున్నా.. ఆ శిక్షల తీవ్రత.. అమలు చేసే విధానాలు పిల్లలపై బాగా ప్రభావం చూపుతున్నాయి. ఇష్టం వచ్చినట్లు కొట్టడం లేదా అందరి ముందు అవమానించటం లాంటివి.. ఒక్కోసారి వారి ప్రాణాలు పోవటానికి కూడా కారణమౌతున్నాయి.
అయితే హర్యానాలో జరిగిన ఘటన మాత్రం వేరేలా ఉంది. ఓ స్టూడెంట్ ఏకంగా క్లాస్ రూంలోనే టీచర్‌ను చంపేందుకు యత్నించాడు. ఝజ్జర్ జిల్లా నజఫ్‌గడ్ రోడ్‌లో ఉన్న హర్దయాల్ పబ్లిక్ స్కూల్ లో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. క్లాస్ రూంలో పేపర్లు దిద్దుకుంటున్న టీచర్‌పై 12వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థి ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. తన బ్యాగులో అప్పటిదాకా దాచుకున్న ఆయుధంతో ఒక్కసారిగా దాడి చేశాడు. ఊహించని ఆ పరిణామానికి బిత్తరపోయిన ఆ టీచర్ ప్రతిఘటించలేక బయటకు పరిగెత్తాడు. అయినా వదలని ఆ విద్యార్థి వెంటపడి గాయపరచసాగాడు. ఇంతలో మరో టీచర్ వచ్చి బెదిరించటంతో కాస్త వెనక్కి తగ్గిన ఆ విద్యార్థిని ఇతర విద్యార్థుల సాయంతో కట్టడి చేయగలిగారు.
పరీక్షలో తక్కువ మార్కులు వేయటంతోపాటు.. అందరి ముందు తిట్టాడన్న కోపంతోనే ఈ స్టూడెంట్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. దీనికిగానూ మరో విద్యార్థి కూడా సహకరించటంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. తలపై తీవ్ర గాయాలు కావటంతో టీచర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన స్కూల్ యాజమాన్యం శనివారం పేరెంట్స్ మీటింగ్ ను ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment