
భర్త చేతిలో గాయాలపాలైన భార్య లక్ష్మి గాయపడిన లచ్చయ్య
సిద్దిపేటకమాన్: మూడు ముళ్లు వేసి, ఏడు అడుగులు నడిచి కలకాలం కలిసి ఉంటానని భరోసా ఇచ్చిన కట్టుకున్న భర్తనే భార్య పట్ల కసాయిగా మారాడు. కుటుంబకలహాలతో కట్టుకున్న భార్యపై గొడ్డలితో భర్త హత్యాయత్నం చేసిన సంఘటన సిద్దిపేట పట్టణంలోని హనుమాన్ నగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. సిద్దిపేట టూటౌన్ పోలీస్‌ల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు మండలం ఏలేశ్వరం గ్రామానికి చెందిన మ్యాకల లక్ష్మి, శంకర్ దంపతులు గత కొద్దికాలంగా సిద్దిపేట పట్టణంలోని హనుమాన్‌నగర్ మహేశ్వర రైస్‌మీల్ దగ్గరలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. శంకర్ గత కొద్దిరోజులుగా పనికి వెళ్లకుండా ఇంటిదగ్గరే ఉంటున్నాడు. ఈ క్రమంలో శంకర్ భార్య లక్ష్మి కుటుంబ పోషణ నిమిత్తం కూలీ పనులకు Ððవెళ్తోంది. శంకర్ కూలీ పనికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండడాన్ని గుర్తించిన శంకర్ బావమరుదులైన రాసూరి శ్రీను, రాఘవలు మా అక్క లక్ష్మిని ఎందుకు పనికి పంపిస్తున్నావు, నీవు పనికి ఎందుకు వెళ్లడం లేదని శంకర్‌ను ప్రశ్నించారు.
దీంతో నన్నే ప్రశ్నిస్తారా అని ఆగ్రహించిన శంకర్ ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకుని లక్ష్మిపై హత్యాయత్నం చేశాడు. దీనిని అడ్డుకోబోయిన శ్రీను, రాఘవలకు గాయాలయ్యాయి. భార్య లక్ష్మి ఎడమభుజంపై తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన రైస్‌మిల్ యజమాని, స్థానికులు ఘటన స్థలానికి రావడాన్ని గమనించిన శంకర్ ఇంటి గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో శంకర్ తలకు రాయితగిలి తీవ్ర రక్తస్త్రావం అయింది. గమనించిన స్థానికులు 108కి సమాచారం అందించగా వారు గాయపడిన వారిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన లక్ష్మిని వైద్యులు చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిఇకి తరలించారాఉ. గాయపడిన శంకర్, శ్రీను, రాఘవాలు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లక్ష్మి తమ్ముడు శ్రీను ఫిర్యాదు మేరకు సిద్దిపేట టూటౌన్ పోలీసులు శంకర్‌పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment