సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటాను చోరీ చేసిన ఐటీ గ్రిడ్స్, టీడీపీ సర్కార్ మహా పన్నాగం బట్టబయలు అయింది. తెలుగుదేశం పార్టీ సైబర్ కుట్రను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్ వచ్చిన టీడీపీ వ్యతిరేక ఓట్ల తొలగింపుకు సంబంధించి సాక్ష్యాలతో సహా బయటపెట్టారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్. ఈ కేసు విచారణకు సంబంధించిన వివరాలను ఆయన బుధవారం మీడియాకు వివరించారు. అత్యంత రహస్యంగా ఉండాల్సిన సమాచారం ఐటీ గ్రిడ్ కంపెనీ సర్వర్‌లో నిక్షిప్తమై ఉందని ఆయన తెలిపారు. ఐటీ గ్రిడ్స్ ద్వారా ఆ సమాచారాన్ని టీడీపీ ’సేవామిత్ర’ వాడుకుంటోందని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో ఓ కీలక వ్యక్తి ఉన్నారని, అతడు కోడ్ భాషలో మాట్లాడుతున్నాడని, ఆ కోడ్ భాషను డీకోడ్ చేస్తున్నామని సీపీ తెలిపారు. ఆ కీలక వ్యక్తి ఎవరనేది త్వరలోనే తేలుస్తామని ఆయన స్పష్టం చేశారు.
సీపీ అంజన్ కుమార్ మాట్లాడుతూ...‘ఆంధ్రప్రదేశ్‌లో సేవామిత్ర యాప్ ద్వారా సర్వే చేపడుతున్నారు. ఐటీ గ్రిడ్స్ ఇండియా కంపెనీ చాలామంది సర్వేయర్లను నియమించుకున్నారు. సర్వేలో ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తున్నారు అన్నది తెలుసుకున్నారు. సర్వేయర్ల ప్రశ్నావళి ద్వారా సేకరించిన సమాచారం టీడీపీ బూత్ లెవల్ అధికారులకు వెళుతుంది. సేవామిత్ర వెబ్‌సైట్‌లో బూత్ కన్వీనర్లు, డ్యాష్ బోర్డు వివరాలున్నాయి. సర్వేలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఏ పార్టీకి ఎంత రేటింగ్ ఇస్తారో సర్వే ద్వారా తెలుసుకుంటున్నారు. వ్యక్తిగత వివరాలైన ఆధార్, ఓటర్ ఐడీ వివరాలు సేకరించారు. ఆ క్వశ్చనీర్‌లోనే ఎన్నికల సరళిపై సర్వే చేయడంతో పాటు, ఏ పార్టీకి ఓటేస్తారని ఫోన్లు చేసి తెలుసుకుంటున్నారు. డేటా చోరీ, ఓట్ల గల్లంతుపై ఫిర్యాదు చేసిన ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. అందుకే మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం.
ఈ ఫిర్యాదుపై ఐటీ గ్రిడ్స్ సంస్థ మీద ఐపీసీ 420,467,468,471,120బీ కింద కేసులు నమోదు చేశాం. ఫిర్యాదుదారు వాంగ్మూలం తీసుకున్నాం. విజయవాడకు చెందిన కందుల రమేశ్, కందుల నాగమణికి ఓటర్ ఐడీ ఉంది. చిత్తూరు జిల్లాకు చెందిన వేణుగోపాల్ రెడ్డి హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో వీరి పేర్లు గల్లంతయ్యాయి. వారి వివరాలు ఆన్‌లైన్ వెరిఫికేషన్‌లో రావడం లేదు. దశరథ రామిరెడ్డి ఫిర్యాదులో 2018 ఎన్నికల్లో జార్జియా రాష్ట్రంలో 3వేల మంది మైనార్టి ఓటర్లను తీసేశారాని పేర్కొన్నారు. సైబారాబాద్ పోలీసులు ఇప్పటికే ఐటి గ్రిడ్స్ సంస్థపై విచారణ జరుపుతున్నారు. సైబారాబాద్ పోలీసులతో కలిపి విచారణ జరుపుతాం. ఎన్నికల సంఘానికి లేఖలు రాస్తాం. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఎవరు అన్నది కనుక్కోవాలి. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం. ఇక సర్వర్ నుంచి డేటా ఇవ్వాల్సిన బాధ్యత గూగుల్, అమెజాన్ సంస్థలపై ఉంది. ఇప్పటికే ఆ సంస్థకు నోటీసులు ఇచ్చాం, త‍్వరలో సమాధానం వస్తుంది.’ అని సీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment