తంత్రయ్ మృతదేహం పక్కన రోదిస్తున్న బంధువు
శ్రీనగర్: ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్(జేఈఎం)కు గట్టిదెబ్బ తగిలింది. కశ్మీర్‌లో ఆ సంస్థ పుంజుకోవడంలో కీలక పాత్ర పోషించిన టాప్ కమాండర్ నూర్ మహమ్మద్ తంత్రయ్(47)ను భద్రతా బలగాలు హతమార్చాయి. పుల్వామా జిల్లాలోని సాంబూరాలో సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఎన్‌కౌంటర్‌లో తంత్రయ్ మృతి చెందినట్లు కశ్మీర్ పోలీసులు చెప్పారు. అతని అనుచరులుగా భావిస్తున్న మరో ఇద్దరు విదేశీ ఉగ్రవాదులు పారిపోయారు. ఘటనా స్థలం నుంచి తంత్రయ్ మృతదేహంతో పాటు ఒక ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ చెప్పారు. భద్రతా బలగాల వాహనశ్రేణిపై దాడిచేయడానికి కొందరు ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నారన్న సమాచారం అందడంతో అప్రమత్తమయ్యామని తెలిపారు.
సాంబూరాలో అనుమానిత ఇళ్లనన్నింటిని తనిఖీచేస్తుండగా ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుందని తెలిపారు. శ్రీనగర్‌లో బీఎస్‌ఎఫ్ క్యాంప్‌పై దాడి తదితర ఘటనల్లో తంత్రయ్ హస్తముందని వైద్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నమే తంత్రయ్ మృతదేహాన్ని అతని సొంత గ్రామం త్రాల్‌లో ఖననం చేశారు. 2001లో పార్లమెంట్‌పై జరిగిన దాడిలో సూత్రధారి ఘాజి బాబాకు అత్యంత సన్నిహితుడైన తంత్రయ్ 2003లో ఓ కేసులో దోషిగా తేలడంతో శ్రీనగర్‌లో జైలు శిక్ష అనుభవించాడు. 2015లో పెరోల్‌పై బయటికొచ్చాడు. అప్పటి నుంచి సొంతూరు త్రాల్‌లోనే ఉంటూ జైషే మహమ్మద్ విస్తరణకు కృషిచేశాడు. ఈ ఏడాది జూలైలో ఆరిపాల్ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జేఈఎం ఉగ్రవాదులు హతమైన తరువాత అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జమ్మూ కశ్మీర్ పోలీసులు తంత్రయ్ కోసం నిఘా పెంచారు.
పొట్టివాడేగానీ...
అతని ఎత్తు కేవలం నాలుగు అడుగుల 2 అంగుళాలు. కాలు సరిగా పనిచేయదు. కర్ర లేకుండా నడవలేడు. ఇన్నాళ్లూ తన తెలివితేటలతో తప్పించుకున్నాడు. కశ్మీర్‌లో పలు ఉగ్ర దాడుల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాలుపంచుకుని భద్రతా బలగాలకు కొరకరాని కొయ్యగా మారాడు తంత్రయ్. అక్టోబర్ 3న శ్రీనగర్ విమానాశ్రయం బయట బీఎస్‌ఎఫ్ శిబిరంపై, సెప్టెంబర్ 21న కశ్మీర్ మంత్రి నయీమ్ కాన్వాయ్‌పై జరిగిన దాడుల సూత్రధారి ఇతనే అని భావిస్తున్నారు. ‘గతంలో పలుమార్లు తంత్రయ్ త్రుటిలో తప్పించుకున్నాడు. పొట్టిగా ఉండటం వల్లే ఏదో ఒకరోజు తప్పకుండా చిక్కుతాడనుకున్నాం’ అని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. భద్రతా బలగాల నుంచి తప్పించుకోవడానికి ఉగ్రవాదులు జనంలో కలసిపోతారు. తంత్రయ్‌కు ఆ చాన్స్ లేదు. ప్రజల్లో కలసిపోయినా తన ఎత్తు, అంగవైకల్యం కారణంగా సులువుగా దొరికిపోతాడని పోలీసులు భావించారు. 25వతేదీ రాత్రి అతను దాక్కున్న ఇంటిని భద్రతా బలగాలు చుట్టుముట్టడంతో అక్కడి నుంచి పారిపోలేకపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment