చికిత్స పొందుతున్న విద్యార్థి నందకిశోర్‌రెడ్డి
సాక్షి, పెండ్లిమర్రి: తల్లిదండ్రులతో గొడవ పడుతున్న తనను బాబాయి మందలించడాన్ని జీర్ణించుకోలే ని ఓ యువకుడు బాబాయి కుమారుడిపై ప్రతీకారం తీర్చుకున్నాడు. నమ్మించి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి నరికి పారిపోయాడు. పెండ్లిమర్రి మండలం కొత్తగంగిరెడ్డిపల్లె సమీపంలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. వల్లూరు మండలం గోసులవారిపల్లె గ్రామానికి చెందిన నరసింహారెడ్డి కుమారుడు భాస్కర్‌రెడ్డి(30) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం బెంగళూరులో ఉంటున్నాడు. ఇతను సోమవారం రాత్రి ఇంటికి వచ్చాడు. డబ్బుల విషయంలో ఇంటి వద్ద రాత్రి తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న బాబాయి రామసుబ్బారెడ్డి మంగళవారం ఉదయం భాస్కర్‌రెడ్డిని మందలించాడు.
అది మనసులో పెట్టుకొని బాబాయి కుమారుడిపై కక్ష తీర్చుకోవాలని భావించాడు. పెండ్లిమర్రి మండలం వెల్లటూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న నందకిశోర్‌రెడ్డి వద్దకు వెళ్లి బంధువుల ఇంటికి వెళ్దాం పద అంటూ ద్విచక్రవాహనంలో ఎక్కించుకుని వచ్చాడు. కొత్తగంగిరెడ్డిపల్లె గ్రామ సమీపంలో నందకిషోర్‌రెడ్డిని రోడ్డుపై పడుకోబెట్టి వెంట తెచ్చుకున్న కొడవలితో మెడపై నరికాడు. బాలుడు స్పృహ తప్పి పడిపోవడంతో చనిపోయాడని భావించి బాబాయికి ఫోన్ చేసి మీ కొడుకును కొత్తగంగిరెడ్డిపల్లె వద్ద చంపానని చెప్పి పారిపోయాడు. రామసుబ్బారెడి సంఘటన స్థలానికి వచ్చే సరికి కుమారుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఆర్.వి.కొండారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment