
కృష్ణరాజపురం (బెంగళూరు): కశ్మీర్‌లోని సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగా బెంగళూరులో ఓ యువకుడు ‘అసలైన సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఇదే’ అని ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న జమ్ముకశ్మీర్‌కు చెందిన అబిద్ మాలిక్ అనే యువకుడు ఉగ్రవాదుల దాడిపై తన ఫేస్‌బుక్ ఖాతాలో వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. అసలైన సర్జికల్ దాడి అంటే ఇదే అని అందులో ఎగతాళి చేశాడు. ఆత్మాహుతి దాడి చేసిన ఉగ్రవాదిని పొగుడుతూ ‘రిప్ బ్రో’ అని కూడా వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ సమస్యపై స్పందించకపోతే భవిష్యత్‌లో మరో 40 మంది సైనికులు మరణిస్తారని కూడా ఆ పోస్ట్‌లో హెచ్చరించాడు. దీనిని చూసిన నెటిజన్లు అతనిపై భగ్గుమనడంతో వెంటనే ఖాతా నుంచి పోస్ట్ తొలగించి అబిద్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు అబిద్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment