పట్టుబడిన నిందితులు
మూత్రపిండాలను అమ్ముతాం,కొంటాం. ఇందుకు మొదట రూ.50 వేల వరకు వైద్య బీమా చెల్లించాలి.ఆ వెంటనే వ్యవహారం పూర్తి అని అమాయకుల నుంచి డబ్బులుకొల్లగొడుతున్న ఘరానా ముఠాకటకటాల పాలైంది. ముగ్గురు ఆఫ్రికావాసులు, ముగ్గురు త్రిపుర పౌరులు కలిసి బెంగళూరులో ఈ దందానడిపిస్తున్నారు. బాధితుల నుంచి డబ్బును త్రిపురలోని అమాయకుల ఖాతాల్లోకి మళ్లించి ఆ డబ్బును మళ్లీ వీరు ఏటీఎంల ద్వారా డ్రా చేసుకునేవారు. ఓ వైద్యుని ఫిర్యాదుతో డొంక కదిలింది.
బనశంకరి: అనారోగ్యంతో బాధపడుతున్నవారిని లక్ష్యంగా చేసుకుని మూత్రపిండాల క్రయ విక్రయాల పేరుతో ఇంటర్నెట్లో ప్రకటనలు ఇచ్చి 300 మందికిపైగా మోసగించిన ఒక ముఠాను ఆదివారం బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు ఆఫ్రికావాసులు, మరో ముగ్గురు త్రిపుర రాష్ట్రానికి చెందినవారు ఉన్నారు. నైజీరియాకు చెందిన యెసన్‌లవ్లీ, సూడాన్‌వాసి మహమ్మద్ అహ్మద్ ఇస్మాయిల్ బాబూసాపాళ్యలో సన్మార్‌నగర మార్వన్ కమ్మనహళ్లిలో నివాసం ఉండేవారు. త్రిపుర రాష్ట్రం పారా దలాయి జిల్లాకు చెందిన హిరేంద్ర త్రిపురా, నగర బీడీఏ లేఔట్‌లో మానుఘాట్ దలాయి కేమిరంజన్, జతిన్‌కుమార్‌లు బొమ్మనహళ్లిలో ఉంటున్నారు. ఈ ఆరుమంది వంచకులు సుమారు 300 మంది వద్ద తలా రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు కిడ్నీ విక్రయం పేరుతో వసూళ్లకు పాల్పడ్డారు.
వైద్యుని ఫిర్యాదుతో..
కిడ్నీల అమ్ముతాం, కొంటామంటూ ఆన్‌లైన్‌లో ప్రకటనలు ఇచ్చి డాక్టర్ల పేరుతో ఇ–మెయిల్ ద్వారా ప్రజలను సంప్రదించేవారు. తన ఆసుపత్రి పేరును దుర్వినియోగం చేసుకుని ఆరుమంది వంచకులు కిడ్నీ వ్యవహారాలు నిర్వహిస్తున్నట్లు బాణసవాడికి చెందిన ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యుడుస్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు తీవ్రంగా పరిగణించిన బాణసవాడి ఏసీపీ రవిప్రసాద్ నేతృత్వంలోని పోలీస్‌బృందం ఆరుమంది ముఠాను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
స్కాం చేసేవారిలా
త్రిపుర రాష్ట్రానికి చెందిన పేద ప్రజల నుంచ వీరు మాయమాటలు చెప్పి పెద్దసంఖ్యలో బ్యాంకు అకౌంట్ల నంబర్లు తీసుకున్నారు. వారిపేరుతోనే సిమ్‌కార్డులు, ఏటీఎంలు పొందారు. ఇక కిడ్నీలు అమ్ముకుంటే పెద్దమొత్తంలో ధనం వస్తుందని ఇంటర్నెట్లో ప్రచారం చేసుకున్నారు. బాణసవాడిలో ఓ స్పెషలిస్ట్ ఆసుపత్రి డాక్టర్ పేరును వినియోగించి సుమారు 200 మందిని సంప్రదించారు. మీరు కిడ్నీ కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు, ఇందుకోసం మొదట బీమా చేయాలి, దీనికిరూ.50 వేల నుంచి 60 వేల ఫీజు అవుతుందని నమ్మించేవారు. ఎవరైనా సంప్రదిస్తే, వారి నుంచి డబ్బును త్రిపురలో ప్రజల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసుకుని ఏటీఎం ద్వారా డ్రా చేసుకునేవారు. ఏసీపీ రవిప్రసాద్, సీఐ హెచ్.జయరాజ్, ఎస్‌ఐ సంగీత చౌహన్‌తో కూడిన బృందం వంచక ముఠా ఆచూకీ కనిపెట్టింది. మోసగాళ్లు ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రులు, వైద్యుల పేర్లను వాడుకుంటూ దగాకు పాల్పడినట్లు విచారణలో వెలుగుచూసింది. వీరిపై బాణసవాడిపోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment