విద్యార్థి ఐడీ కార్డు , ప్రతాప్‌రెడ్డి (ఫైల్)
సెల్‌ఫోన్.. ఇది మనిషికి ప్రస్తుతం ఎంతో అత్యవసరమైన, ఇష్టమైన వస్తువు. చాలా పనులు దీని ద్వారానే చేసుకుంటున్నారు. ఒక్కోసారి ఇది ప్రాణం మీదకు తెస్తోంది. మొబైల్ చూస్తూ రోడ్డు, రైలు పట్టాలు దాటుతూ ప్రమాదాల బారిన పడిన వారెందరో. జాగ్రత్తగా ఉండాల్సిందిపోయి మరింత నిర్లక్ష్యంగా ఉంటూ కొందరు ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. అలాంటి ఘటనే నెల్లూరులో చోటుచేసుకుంది.
నెల్లూరు(క్రైమ్): చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పట్టాలు దాటే సమయంలో రైలు ఢీకొని వీఆర్ లా కళాశాల విద్యార్థి మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని విజయమహాల్‌గేటు సమీపంలో చెన్నై వైపు వెళ్లే రైలుపట్టాలపై సోమవారం చోటుచేసుకుంది. దీంతో బాధిత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. రైల్వే పోలీసులు, సంఘటనా స్థలంలోని వారి కథనం మేరకు.. సంగం తూర్పువీధిలో ఉపాధ్యాయడు డి.నరసింహారెడ్డి కుటుంబం నివాసం ఉంటోంది. ఆయనకు భార్య, కుమారుడు రామ్‌ప్రతాప్‌రెడ్డి (23), కుమార్తె ఉన్నారు. పత్రాప్‌రెడ్డి నెల్లూరు వీఆర్ లా కళాశాలలో లా రెండో సంవత్సరం చదువుతున్నాడు. ప్రతిరోజూ కళాశాలకు వచ్చి వెళ్లేవాడు. ఎప్పటిలాగే సోమవారం అతను ఇంటినుంచి బస్సులో నెల్లూరుకు చేరుకున్నాడు.
మినీబైపాస్‌లో బస్సు దిగి నడుచుకుంటూ కళాశాలకు బయలుదేరాడు. విజయమహాల్‌గేట్ సమీపంలో చెన్నై వైపు వెళ్లే రైలుపట్టాలు దాటసాగాడు. చెవులకు ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని మొబైల్‌లో మాట్లాడుతున్నాడో? లేదా సంగీతం వింటున్నాడో తెలియదుకానీ రైలు రావడాన్ని గమనించలేదు. దీంతో అతడిని వేగంగా రైలు ఢీకొంది. ప్రతాప్‌రెడ్డి రెండు కాళ్లు మోకాళ్ల వద్దకు తెగిపోయి వేరుగా పడిపోయాయి. తలకి తీవ్రగాయమైంది. రెండు చేతులు విరిగిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై డీసీ వెంకయ్య సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద లభ్యమైన ఆధారాల ద్వారా బాధిత కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. అనంతరం ప్రభుత్వ వైద్యులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులుకు అప్పగించారు. చేతికందివచ్చిన కుమారుడు విగతజీవిగా మారిపోవడం చూసి బాధిత తండ్రి గుండెలవిసేలా రోదించారు. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సంగంలో విషాదఛాయలు
సంగం: రామ్‌ప్రతాప్‌రెడ్డి మృతితో సంగంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి విష యం తెలియగానే తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, మండల వైఎస్సార్‌సీపీ నేతలు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ప్రతాప్ సంగంలో ఇంటర్ చదివాడు.
Comments
Please login to add a commentAdd a comment