
తమిళనాడు, టీ.నగర్: ప్రేమించలేదన్న ఆగ్రహంతో ముఖంపై యాసిడ్ పోస్తానని కళాశాల విద్యార్థినిని బెదిరించిన యువకుడిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై రాయపురానికి చెందిన 19 ఏళ్ల యువతి. గతంలో ఆమె కేకేనగర్‌లో నివశిస్తుండగా అదే ప్రాంతానికి చెందిన మెకానిక్ వీరపాండి (23) ఆమెను ప్రేమిస్తూ వచ్చినట్లు సమాచారం. పరిచయమైన కొద్ది రోజులకే అతని ప్రవర్తనపై విసిగిన యువతి వీరపాండితో మాట్లాడడం మానేసింది.
దీంతో సదరు యువతి ఇల్లు మార్చుకుని రాయపురానికి చేరుకుంది. ఇలావుండగా యువతి కళాశాలకు వెళుతున్నట్లు తెలుసుకున్న అతను అక్కడికి వెళ్లి ఆమెను ప్రేమించాల్సిందిగా ఒత్తిడి తెచ్చాడు. అతని వేధింపులు తాళలేఖ యువతి హెచ్చరించి పంపేసింది. ఇలావుండగా మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో యువతి ఒంటరిగా ఇంట్లో ఉండగా అక్కడికి వెళ్లిన వీరపాండి ఆమెతో తనను ప్రేమించాలని, లేకుంటే యాసిడ్ ముఖం మీద పోస్తానని బెదిరించి వెళ్లాడు. దీంతో యువతి తన తల్లిదండ్రులతో రాయలనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వీరపాండిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ సమయంలో అతను యాసిడ్ దాడి చేస్తానని బెదిరించినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి జైలులో నిర్బంధించారు.