ఆత్మహత్య చేసుకున్న యువతి దేవి(ఫైల్) ఆత్మహత్యకు యత్నించిన యువకుడు అనుదీప్
మల్కాపురం(విశాఖ పశ్చిమ): పారిశ్రామిక ప్రాంతంలో ఓ యువతి, యువకుడు ఆత్మహత్యకు యత్నించడం... వారిలో యువతి మృతి చెందడం తీవ్ర సంచలనం రేపింది. తమ ప్రేమ ఫలించదనే వేదనతోనే ఆత్మహత్యకు యత్నించామని యువకుడు చెబుతుంటే... తమ కుమార్తెను ప్రేమ పేరుతో వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం... జీవీఎంసీ 49వ వార్డు మల్కాపురం, క్రాంతినగర్ ప్రాంతంలో దేవి(22) అనే యువతి తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. ఆమె డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతంలో దేవి ఇంటికి సమీపాన అనుదీప్(24)అలియాస్ అరవింద్ అనే యువకుడు తల్లిదండ్రులతో ఉంటున్నాడు. స్థానికంగా ఓ కంపెనీలో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 9:15గంటలకు దేవి తన ఇంటిలోని గదిలోకి వెళ్లి ఉరి వేసుకుంది. అనుమానంతో గదిలోకి వెళ్లిన దేవి తల్లిదండ్రులు ఫ్యాన్ హుక్‌కు వేలాడుతున్న దేవిని కిందకు దించి స్థానిక సెయింట్ ఆన్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని స్థానిక వైద్యులు నిర్థారించడంతో మల్కాపురం పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి వచ్చి వివరాలు సేకరించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.
ఘటనపై భిన్న వాదనలు
మరోవైపు 9:40 గంటల సమయంలో తన ఇంటిలో అనుదీప్ ఆత్మహత్యకు యత్నించడంతో కుటుంబ సభ్యులు గుర్తించి రక్షించారని పోలీసులకు సదరు యువకుడు చెబుతున్నాడు. రెండేళ్లుగా తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, యువతి ఇంటిలో ప్రేమ విషయం తెలియడంతో వేరే వారికి ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధమవుతున్నారని... అందువల్లే ఆత్మహత్యకు యత్నించామని అనుదీప్ పోలీసులకు చెబుతున్నాడు. అయితే అతని మెడపైగానీ, ఎక్కడా ఆత్మహత్యకు యత్నించిన ఆనవాళ్లు లేవని... అసలు వారిద్దరి మధ్య ప్రేమే లేదని... ప్రేమ పేరుతో దేవిని అనుదీప్ కొంత కాలంగా వేధిస్తున్నాడని... దీనిపై ఓ లేఖ కూడా దేవి రాసిందని ఆమె చిన్నాన్న మహాత్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
యువకుడి తల్లిదండ్రులను విచారిస్తున్న సీఐ భాస్కర్‌రావు
నిజంగా వారిద్దరూ ప్రేమించుకుంటే ఒకేచోట ఆత్మహత్యకు యత్నించాలి కదా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. దేవి ఆత్మహత్య చేసుకోవడంతో తామంతా అతడిపై దాడి చేస్తామన్న భయంతో అనుదీప్ ఆత్మహత్యాయత్నం డ్రామా ఆడుతున్నాడని, పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. వీరి ఫిర్యాదు మేరకు అనుదీప్‌ను, అతని తల్లిదండ్రులను మల్కాపురం పోలీసులు విచారించారు. అనంతరం సంఘటన స్థలాలకు వెళ్లి పరిశీలించి వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ లంకా భాస్కర్‌రావు తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment