
కేకే.నగర్: మదురై, కోవై, దిండుకల్, నాగపట్నం జిల్లాల్లో దీపావళి పండుగ రోజు పాఠశాల విద్యార్థి సహా ఎనిమిది మంది దారుణ హత్యకు గురయ్యారు. మదురైలో.. మదురై జిల్లా చోళవందన్ సమీపంలోని కీళనాచ్చికులంకు చెందిన మణికంఠన్(39) కూలీ. ఇతడు బుధవారం రాత్రి ఆ ప్రాంతంలోని ఒక ముఠాతో గొడవ పడ్డాడు. ఆగ్రహించిన ముఠా వ్యక్తులు మణికంఠన్‌పై కస్తులతో దాడి జరిపారు. తలకు బలమైన గాయం తగలడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మణికంఠన్ మృతి చెందాడు. అదేవిధంగా చోళవందన్ సమీపంలోని చెల్లదురై(26) లోడుమేన్. పాత కక్షల కారణంగా చెల్లదురైను బుధవారం దారుణంగా హత్య చేశారు. మదురై మేలవాసల్ ప్రాంతానికి చెందిన మారిముత్తు(34) ఆటో డ్రైవర్.
బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘర్షణలో అతడు హత్యకు గురయ్యాడు. మదురై ఎల్లీస్ నగర్‌కు చెందిన శేఖర్(17) ప్లస్ వన్ విద్యార్థి కిడ్నాప్‌నకు గురయ్యాడు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ స్థితిలో శేఖర్ మృతదేహం బుధవారం సాయంత్రం పెరియార్ నగర్‌లోని ముళ్ల పొదల్లో కనిపిచింది. దీనిపై స్వామిదురై, సెల్వకుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మదురై జిల్లా మేలూరు సమీపంలో భరత్ కుమార్(25)తో వాగ్వాదానికి దిగిన నలుగురు వ్యక్తులు బీర్ బాటిల్‌తో అతని తలపై గాయపరిచారు. అన్నకు అడ్డుగా వచ్చిన తమ్ముడు బాలమురుగన్ కడుపులో బీర్ బాటిల్‌తో పొడిచారు. ఈ సంఘటనలో బాలమురుగన్ మృతి చెందాడు. ఇదేవిధంగా మైలాడుదురై సమీపంలో రవి(55), తూత్తుకుడికి చెందిన గురు, కోవై రాశిపురం సమీపంలో చిన్నదురై(38), పొల్లాచ్చిలో ఆర్ముగం (50) దారుణ హత్యలకు గురయ్యారు.
అనుమానం పెనుభూతం
కేకే.నగర్: నాగపట్నం జిల్లా నాగూర్ వడక్కుడి జీవా వీధికి చెందిన కళై అరసన్(39). ఇతని భార్య ధనలక్ష్మి. భార్య ప్రవర్తనపై అనుమానంతో కళై అరసన్ తరచూ గొడవ పడేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం జరిగిన ఘర్షణలో కళై అరసన్ ఆవేశంతో ఇంట్లో ఉన్న గ్రైండర్ బండరాయితో భార్య ధనలక్ష్మి గుండెపై ఢీకొట్టాడు. దీంతో శ్వాస అందక ధనలక్ష్మి మృతి చెందింది. నాగూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, కళై అరసన్‌ను అరెస్టు చేశారు.