చార్జ్‌షీటే తరువాయి..! | Mall Practice Case Charge Sheet On Students | Sakshi
Sakshi News home page

చార్జ్‌షీటే తరువాయి..!

Published Thu, Aug 23 2018 9:26 AM | Last Updated on Thu, Aug 23 2018 9:26 AM

Mall Practice Case Charge Sheet On Students - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ముషీరాబాద్‌లోని ఆర్కే డిగ్రీ కాలేజ్‌ కేంద్రంగా ఉస్మానియా యూనివర్శిటీ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల్లో జరిగిన మాస్‌ కాపీయింగ్‌ కేసులో విద్యార్థులు సైతం నిందితులుగా మారారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీసీఎస్‌ అధికారులు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాపీయింగ్‌కు సహకరించేందుకు దళారుల ద్వారా నగదు చెల్లించి, ఆర్కే డిగ్రీ కాలేజీ కేంద్రంగా పరీక్ష రాసిన 104 మంది విద్యార్థులపై చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 40 మందికి సీఆర్పీసీ 41 (నిందితులుగా) నోటీసులు  ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే ఆర్కే డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌తో పాటు కొందరు దళారులనూ అరెస్టు చేసిన విషయం విదితమే. గత అక్టోబర్‌లో ఉస్మానియా యూనివర్శిటీకి సంబంధించిన డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఇందులో భాగంగా ముషీరాబాద్‌లోని ఆర్కే డిగ్రీ కాలేజీలోనూ సెంటర్‌ ఏర్పాటు చేశారు. సాధారణంగా పరీక్షా కేంద్రానికి యూనివర్శిటీ ప్రశ్నపత్రాలతో పాటు జవాబు పత్రాల సెట్లను అందిస్తుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అభ్యర్థుల సంఖ్య కంటే కొన్ని ఎక్కువగానే జవాబు పత్రాల సెట్‌లు అందజేస్తుంది. దీనిని అనుకూలంగా మార్చుకున్న ఆర్కే డిగ్రీ కాలేజ్‌ యాజమాన్యం సప్లిమెంటరీ పరీక్ష రాసే 104 మంది విద్యార్థులతో కుమ్మక్కై వేరే కేంద్రానికి సంబంధించి హాల్‌టికెట్‌ జారీ అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా తమ కేంద్రంలో పరీక్ష రాసే అవకాశం ఇచ్చింది.

వీరికోసం యూనివర్శిటీ నుంచి అదనంగా వచ్చే జవాబు పత్రాల సెట్‌లను వాడుకుంది. ఇందుకుగాను ఒక్కో సబ్జెక్ట్‌కు దాదాపు రూ.5 వేల వరకు వసూలు చేసినట్లు పోలీసులు తేల్చారు. ఇలా మాస్‌ కాపీయింగ్‌ ద్వారా పరీక్ష రాసిన విద్యార్థుల్లో కొందరి పేర్లతో రెండేసి ఆన్సర్‌ షీట్లు సిద్ధమయ్యాయి. గుట్టుగా సాగిన ఈ వ్యవహారాన్ని యూనివర్శిటీ అధికారులు గుర్తించారు. గత అక్టోబర్‌ 21న ఆర్కే డిగ్రీ కళాశాల కేంద్రంలో జరిగిన కంప్యూటర్‌ సైన్స్‌–3 పరీక్ష పేపర్లు దిద్దుతున్న వర్శిటీ పరీక్షల విభాగం అధికారులు ఈ మాల్‌ ప్రాక్టీస్‌ స్కామ్‌ను పసిగట్టారు. ఆర్‌.హరికృష్ణ అనే విద్యార్థి పేరుతో రెండు ఆన్సర్‌ బుక్‌లెట్స్‌ వర్శిటీకి వచ్చాయి. ఇతడికి పరీక్ష కేంద్రంలో 7257771 నంబర్లతో కూడిన బుక్‌లెట్‌ ఇవ్వగా... దీంతో పాటు 7257384 నంబర్‌తో కూడిన బుక్‌లెట్‌ సైతం అతడి నుంచి కాలేజీ ద్వారా వర్శిటీకి చేరింది. దీంతో కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇతడి ఫలితాన్ని ఆపేశారు. దీంతో హరికృష్ణ వర్శిటీ అధికారులను సంప్రదించగా... ఆర్కే కాలేజీ నుంచి అటెండెన్స్‌ షీట్‌ తీసుకురావాలని సూచించారు. హరికృష్ణ తీసుకువెళ్లిన షీట్‌లో ఉన్న వివరాల ప్రకారం 7257771 బుక్‌లెట్‌ అతడికి జారీ అయింది. దీనిపై చీఫ్‌ సూపరింటెండెంట్‌ ముద్ర ఉండగా... 7257384 నంబర్‌తో కూడిన బుక్‌లెట్‌పై కాలేజీ ప్రిన్సిపాల్‌ ముద్ర ఉంది. దీంతో లోతుగా ఆరా తీసిన అధికారులు మాల్‌ప్రాక్టీస్‌ జరిగినట్లు గుర్తించారు.

ఆర్కే డిగ్రీ కాలేజీలో ఏకంగా బుక్‌లెట్స్‌ను విద్యార్థులకు ముందే అందించినట్లుగా వర్శిటీ అధికారులు గుర్తించారు. ఈ కేంద్రంలో పరీక్ష రాసిన మొత్తం 104 మంది విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడినట్లు తేల్చారు. వీరికి వేర్వేరు పరీక్ష కేంద్రాలు కేటాయించినా...ఆర్కే కాలేజీలో పరీక్ష రాసినట్లు  తేల్చారు. వర్శిటీ అధికారులు ఓయూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయండంతో, ప్రాథమిక ఆధారాలను బట్టి ఆ కాలేజీ యాజమాన్యం, చీఫ్‌ సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్, ఇన్విజిలేటర్లు తదితరులపై పోలీసులు చీటింగ్, ఫోర్జరీ, ఏపీ పబ్లిక్‌ ఎగ్జామ్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ మాల్‌ ప్రాక్టీసెస్‌ అండ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా దర్యాప్తు బాధ్యతలను సీసీఎస్‌కు అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన ఎస్సై జగదీశ్వర్‌రావు మాల్‌ ప్రాక్టీస్‌ జరిగినట్లు గుర్తించిన సమాధాన పత్రాలతో పాటు అనేక ఆధారాలు సేకరించారు. ఇందులో కాలేజీ ప్రిన్సిపాల్‌ స్వర్ణలత పాత్ర రూఢీ కావడంతో ఆమెను అరెస్టు చేశారు. ఈ 104 మంది విద్యార్థులను కొందరు దళారులు ఆర్కే డిగ్రీ కాలేజీ నిర్వాహకుల వద్దకు తీసుకువచ్చినట్లు తేల్చారు. నగదు చెల్లించి మాల్‌ ప్రాక్టీస్‌ ద్వారా పరీక్ష రాసిన నేపథ్యంలో వీరినీ నిందితుల జాబితాలో చేర్చారు. అందరినీ అరెస్టు చేయడం సాధ్యం కాని నేపథ్యంలో సీఆర్పీసీ 41 (ఏ) కింద నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 40 మందిని ఈ విధంగా పిలిచిన దర్యాప్తు అధికారి వారి నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు. మిగిలిన వారికీ నోటీసుల జారీ పూర్తయిన తర్వాత విద్యార్థులతో సహా నిందితులు అందరిపై న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేయనున్నారు. గరిష్టంగా నెల రోజుల్లో దీనిని పూర్తి చేయాలని భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement