
ప్రతీకాత్మక చిత్రం
గువహటి : పెళ్లి వేడుకల్లో బాణాసంచా పేలుళ్లను వద్దన్నందుకు 35 సంవత్సరాల వ్యక్తిని దారుణంగా కొట్టి చంపిన ఘటన అసోంలో చోటుచేసుకుంది. నల్బారి జిల్లాలోని గురతోల్‌లో మంగళవారం రాత్రి పెళ్లి వేడుకలో బాణాసంచా కాల్చుతుండగా పొరుగున ఉండే జతిన్ దాస్ అభ్యంతరం తెలిపారు. బాణాసంచా కాల్చుతుండగా ఓ టపాసు దాస్ కాలికి తగలడంతో ఘర్షణ ప్రారంభమైందని పోలీసులు చెప్పారు. టపాసులు పేల్చడంపై దాస్ ఆగ్రహం వ్యక్తం చేయగా అతనిపై ఆరుగురు వ్యక్తులు దాడి చేసి దారుణంగా కొట్టారు.
తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడని నల్బారి ఎస్పీ శైలాదిత్య చెటియా తెలిపారు. కాగా వరుడి ఇంటికి పెళ్లికుమార్తె రాకపోవడంతో పెళ్లి జరగలేదని పోలీసులు చెప్పారు. ఘటన నేపథ్యంలో ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసు బలగాలను మోహరించారు.
ఆరుగురు నిందితులను వెంటనే అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. దినసరి కూలీ అయిన బాధితుడు దాస్‌పై నిందితులు మద్యం మత్తులో దాడికి పాల్పడిఉంటారని స్ధానికులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment