
వంశీ మృతదేహం, వంశీ (ఫైల్)
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఏపూరు గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోకబత్తిని వంశీ (23) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కల్లేపల్లి చంద్రమోహన్ భార్యతో వంశీ కొంతకాలంగా సఖ్యతగా ఉంటున్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన చంద్రమోహన్ యువకుడిని పలుమార్లు మందలించాడు.
అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో శుక్రవారం రాత్రి తన ఇంట్లోనే నిద్రిస్తున్న వంశీపై చంద్రమోహన్ కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. తల, ఛాతిపై దాడిచేశాడు. వంశీ అరుపులు విన్న తల్లి ప్రమీల అడ్డుకోబోగా ఆమెకు కూడా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే తీవ్రంగా గాయపడ్డ వంశీని చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలించారు. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. దీంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి నిందితుడు చంద్రమోహన్‌ను అరెస్టు చేసినట్టు ఏఎస్సై సత్యనారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment