వివరాలు సేకరిస్తున్న సీఐ బొల్లం రమేశ్
అశ్వాపురం: అశ్వాపురం మండలం అమ్మగారిపల్లిలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఓ వాగులో సోమవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలంలో పోలీసుల ప్రాథమిక విచారణలో సదరు వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడని నిర్ధారించారు. మృతదేహం పూర్తిగా పాడై కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటంతో మృతి చెందిన వ్యక్తిని ఐదు రోజుల కిందట హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు ఏపీ రాష్ట్రం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వాసిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పోలీసుల కథనంప ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఇద్దరు గొర్లు, మేకల వ్యాపారులు ఐదు రోజుల కిందట అశ్వాపురం మండలం అమ్మగారిపల్లికి వచ్చారు. నాలుగు రోజుల కిందట రాత్రి ఇద్దరు కలిసి అతిగా మద్యం సేవించారు. అనంతరం ఇద్దరిలో ఒకరు హత్యకు గురయ్యారు. వారు కూర్చొని మద్యం సేవించిన ప్రాంతంలో పగిలి ఉన్న బీరు సీసా, ఒక మొద్దుపై రక్తపు మరకలు ఉన్నాయి. ఒక కర్రతో కొట్టినట్టు కర్రకు కూడా రక్తం మరకలు ఉన్నాయి.
ఆ ప్రాంతం నుంచి మృతదేహాన్ని ఈడ్చుకు వెళ్లి వాగులో పడేసినట్లు ఉండటంతో పోలీసులు హత్య జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. ఇద్దరిలో మరో వ్యక్తి వెంటనే తమ ఊరు జగ్గయ్యపేట వెళ్లాడు. ఆ ఊర్లో మృతుడి బంధువులు, స్థానికులు ఇద్దరు కలిసి వెళ్లి ఒక్కడివే వచ్చావు? అతను ఏడి అని నిలదీశారు. దీంతో ఆ వ్యక్తి జగ్గయ్యపేట పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పాడు. జగ్గయ్యపేట పోలీసులు అశ్వాపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అశ్వాపురం పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. అశ్వాపురం సీఐ బొల్లం రమేశ్ సిబ్బందితో ఆ వ్యక్తిని తీసుకొని ఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని, ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికులతో మాట్లాడి పూర్తి వివరా>లు సేకరించారు. అమ్మగారిపల్లి వీఆర్‌ఓ కృష్ణవేణి పంచనామా నిర్వహించారు. మృతదేహానికి ఘటనా స్థలంలో పోస్టుమార్టం నిర్వహించారు. ప్రాథమిక విచారణలో మృతుడిని హత్య చేసినట్టుగా భావిస్తున్నామని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని అశ్వాపురం సీఐ బొల్లం రమేశ్ విలేకరులకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment