సాక్షి, చెన్నై : నటుడు రాఘవ లారెన్స్ పేరుతో రూ.18 లక్షల మోసానికి పాల్పడిని వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. నటుడు, నృత్యదర్శకుడు రాఘవ లారెన్స్ సేవా కార్యక్రమాల కోసం ట్రస్ట్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా లారెన్స్ ట్రస్ట్‌కు ఉపాధ్యక్షుడినని చెప్పి ప్రవీణ్‌కుమార్ అనే వ్యక్తి ఒక వైద్య విద్యార్థికి తక్కువ ఖర్చుతో సీటు ఇప్పిస్తానని చెప్పి రూ.18 లక్షలు వసూలు చేశాడు. రామనాథపురం, చిన్నకడై వీధికి చెందిన అల్‌అమీన్ భార్య పత్తూన్ నిషా. వీరి కూతురు హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ కళాశాలలో నీట్ పరీక్ష రాసింది. అందులో చాలా తక్కువ మార్కులతో ఉత్తీర్ణత పొందినట్లు తెలిసింది.
కాగా కొన్ని నెలల క్రితం పత్తూన్ నిషా చిన్న కడై ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ట్రావెల్స్‌లో తన కూతురి కోసం టిక్కెట్ కొనడానికి వెళ్లింది. అప్పుడక్కడ పని చేస్తున్న మహిళతో తన కూతురు మెడికల్ సీటు గురించి చెప్పింది. అక్కడే ఉన్న ప్రవీణ్‌కుమార్ పత్తూర్ నిషాకు తనను పరిచయం చేసుకుని, తాను నటుడు రాఘవ లారెన్స్ నిర్వహిస్తున్న ట్రస్ట్‌కు ఉపాధ్యక్షుడినని చెప్పాడు. అంతే కాదు రాఘవ లారెన్స్ ట్రస్ట్ ద్వారా మీ అమ్మాయికి వూలూర్‌లోని వైద్య కళాశాలలో తక్కువ ఖర్చుతో సీటు ఇప్పిస్తానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన పత్తూర్ నిషా ప్రవీణ్‌కుమార్ చెప్పిన బ్యాంక్ ఎకౌంట్‌కు మొదటి సారిగా రూ.4.5 లక్షలు పంపింది.
ఆ తరువాత హాస్టల్ వసతి, ఫీజు అంటూ ప్రవీణ్ బ్యాంక్ ఎకౌంట్‌కు మరికొంత డబ్బును పంపారు. అలా మొత్తం పత్తూర్ నిషా నుంచి రూ.18 లక్షలు వసూలు చేసిన ప్రవీణ్‌కుమార్ ఆమె కూతురికి మెడికల్ సీటు ఇప్పించలేదు. దీంతో అనుమానం వచ్చి పత్తూర్ నిషా నటుడు రాఘవలారెన్స్ ట్రస్ట్ కార్యాలయానికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది. వివరాలు విన్న ట్రస్ట్ నిర్వాహకులు ప్రవీణ్‌కుమార్ పేరుతో తమ ట్రస్ట్‌లో ఎవరూ లేరని స్పష్టం చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన పత్తూర్ నిషా తన భర్తతో కలిసి రామనాథపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఓం ప్రకాశ్ మీనాక్షిని కలిసి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ప్రవీణ్‌కుమార్ కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment