
రోడ్డు మీద విగతజీవిగా పడి ఉన్న ఇమ్రాన్ హుసేన్
జిల్లాలో చోటుచేసుకున్న వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మరణించారు. తిరుపతి–రేణిగుంట మార్గంలో సంభవించిన ప్రమాదంలో పుంగనూరు యువకుడు, బైక్ నుంచి అదుపు తప్పి పాకాల మండలంలో సోమల మండల వాసి దుర్మరణం చెందారు.
తిరుపతి క్రైం/పుంగనూరు: డివైడర్‌ను ఢీకొని మోటార్ సైక్లిస్టు దుర్మరణం చెందిన సంఘటన ఆదివారం తిరుపతి–రేణిగుంట మధ్యమార్గంలోని మారూతీ షోరూం సమీపంలో చోటుచేసుకుంది. అలిపిరి సీఐ డేగల ప్రభాకర్, ఎస్‌ఐ నాగార్జునరెడ్డి కథనం.. పుంగనూరు మున్సిపల్ ఉద్యోగి జహీర్ హుసేన్ ఏకైక కుమారుడు ఇమ్రాన్ హుసేన్(20) తిరుపతిలో మేస్త్రీ పని చేస్తున్న రంజిత్‌ను కలిసేందుకు వచ్చాడు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ద్విచక్రవాహనంపై రేణిగుంట నుంచి తిరుపతికి వస్తుండగా మారూతీ షోరూం సమీపంలో వాహనం అదుపుతప్పి మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో వెనుక కూర్చుని ఉన్న ఇమ్రాన్ హుసేన్ కింద పడి తలకు తీవ్రగాయమై అక్కడిక్కడే మృతిచెందాడు.
ద్విచక్రవాహనం నడుపుతున్న రంజిత్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని హుటాహుటిన రుయా ఆస్పత్రికి తరలించారు. ఇమ్రాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. విషయం తెలియగానే పుంగనూరు అంజుమన్ కమిటి సెక్రటరీ అమ్ము జహీర్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అలాగే, పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపారు. పుంగనూరు మున్సిపల్ కమిషనర్ కేఎల్.వర్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణంతో పాటు మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్దీన్ షరీఫ్ మృతుని కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment