పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు ఉమాపతి
సాక్షి, వజ్రపుకొత్తూరు(శ్రీకాకుళం) : స్వలింగ సంపర్కమే నిండు ప్రాణం బలిగొంది. పెద్దలు హెచ్చరించినా... తోటి మిత్రులు వారించినా కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య సంబంధం కొనసాగింది. స్వలింగ సంపర్కుని నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు ఆశించడం... ఆపై గొడవలకు దారి తీసిన నేపథ్యంలో పక్కాగా ప్రణాళికతో హత్య చేసిన సంఘటన వజ్రపుకొత్తూరు మండలం కొత్తపేట సముద్ర తీరంలో చోటు చేసుకుంది. అమలపాడు గ్రామానికి చెందిన యువకుడు దున్న శాంతా రావు అదే గ్రామానికి చెందిన స్నేహితుడు దాసరి ఉమాపతి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ అసహజ సంబంధం కోసమే మృతుడు ఆర్మీ ఉద్యోగాన్ని సైతం మధ్యలోనే వదిలేయడం గమనార్హం.
ఈ ఘటన చుట్టుపక్కల గ్రామాల్లో కలకలం రేపింది. కాశీబుగ్గ రూరల్ సీఐ ఎన్. శేషు, వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ ఎం గోవింద వెల్లడించిన వివరాల ప్రకారం... అమలపాడు గ్రామానికి చెందిన దున్న భాస్కరరావు, కస్తూరి పెద్ద కుమారుడు దేవరాజు ఇండియన్ ఆర్మీలో విధుల్లో ఉన్నాడు. రెండో కుమారుడు శాంతారావు ఏడాదిన్నర క్రితం ఇండియన్ ఆర్మీలో ఉద్యోగంలో చేరాడు. అనంతరం నిందితుడు దాసరి ఉమాపతి, మృతుడు శాంతారావుకు మధ్య స్వలింగ సంపర్కం కారణంగా ఉద్యోగం మధ్యలోనే వదిలేసి గ్రామంలో తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. స్వలింగ సంపర్కాన్ని ఆసరాగా చేసుకుని నిందితుడు ఉమాపతి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడని మృతుని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు మొరపెట్టుకున్నారు. ఈ మేరకు పోలీసు స్టేషన్ వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై విలపించారు.
పెద్దలు వారించినా వినలేదు..
నిందితుడు, మృతుడు మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఇక నుంచి సంబంధాలు కొనసాగరాదని గ్రామ పెద్దలు హెచ్చరించారు. అయినప్పటికీ మళ్లీ ఏడాదిన్నరగా స్వలింగ సంపర్కాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడు దాసరి ఉమాపతి గురువారం మధ్యాహ్నం కొత్తపేట సముద్ర తీరానికి మృతుని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. అప్పటికే తనతో తెచ్చుకున్న మారణాయుధంతో హతుని తల వెనుక భాగంలో నాలుగు చోట్ల బలంగా దాడి చేయడంతో శాంతారావు మృతి చెందాడు. వెంటనే మృతదేహాన్ని సముద్రంలో వదిలేసి తనకు తెలియనట్లు గ్రామానికి చేరుకున్నాడు.
శుక్రవారం తోటూరు– గుణుపల్లి తీరంలో మృతదేహం కనిపించడంతో స్థానిక మత్స్యకారుల సమాచారం మేరకు వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ ఎం గోవింద సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు ఉమాపతిని కాశీబుగ్గ రూరల్ సీఐ ఎన్ శేషు, ఎస్‌ఐ గోవింద అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్య చేశానని అంగీకరించాడు. ఈయనతోపాటు హత్యలో ఇంకా ఎవరి ప్రాత ఉందేమోన్న కోణంలో విచారణ చేపట్టారు. సంఘటనా స్థలంలో జాగిలాలతో తనిఖీ చేశారు. మృతుని బైక్, సెల్‌ఫోన్, మెమరీ కార్డు దొరకడంతో స్వాధీనం చేసుకున్నారు. పంచనామా చేపట్టి పోస్టుమార్టం కోసం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment