పర స్త్రీ వ్యామోహంలో.. ప్రాణాలు కోల్పోయాడు | A Man Eventually Lost His Life In An Extramarital Affair | Sakshi
Sakshi News home page

పర స్త్రీ వ్యామోహంలో.. చివరికి ప్రాణాలు కోల్పోయాడు

Published Mon, Aug 19 2019 8:02 AM | Last Updated on Mon, Aug 19 2019 4:17 PM

A Man Eventually Lost His Life In An Extramarital Affair - Sakshi

మృతుడి పిల్లలు (ఇన్‌సెట్లో), వీరరాఘవులు (ఫైల్‌) 

సాక్షి, మనుబోలు: భార్యాబిడ్డలను నిర్లక్ష్యం చేసి పర స్త్రీ వ్యామోహంలో పడిన ఓ వ్యక్తి చివరికి ప్రాణాలు కోల్పోయిన  ఘటన ఆదివారం నెల్లూరు జిల్లా మండలంలోని పిడూరుమిట్టలో ఆలస్యంగా వెలుగు చూసింది. మృతుడి భార్య కథనం మేరకు.. మండలంలోని పిడూరుమిట్టకు చెందిన ఆలకుంట వీరరాఘవులు (25) జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య సుభాషిణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. సుమారు ఏడాది క్రితం వీరరాఘవులు పని నిమిత్తం నెల్లూరుకు చెందిన వెంకటేశ్వర్లు ద్వారా తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా బూత్‌పూర్‌ మండలం బట్టుపల్లి వద్ద ఓ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో పనికి వెళ్లాడు. నెల రోజులు అక్కడ పని చేసి తిరిగి ఇంటికి వచ్చాడు. అయితే అప్పటి నుంచి అప్పుడప్పుడూ తిరిగి అక్కడికి వెళ్లి వస్తుండే వాడు. ఈ క్రమంలో 3 నెలలుగా వీరరాఘవులు ఇంటికి రాకపోవడంతో భార్య సుభాషిని ఆరా తీసింది. వీరరాఘవులు బట్టుపల్లి గ్రామంలో కిరాణా కొట్టు నిర్వహిస్తున్న ఓ వివాహితతో సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది.

ఈ నేపథ్యంలో సుమారు నెల క్రితం వీరరాఘవులు బట్టుపల్లికి చెందిన మహిళతో కలిసి ఎటో వెళ్లిపోయాడు. దీంతో ఆమె భర్త గంగాధర్‌ వీరరాఘవులు భార్య సుభాషిణికి ఫోన్‌చేసి విషయాన్ని చెప్పి, తన భార్యను అప్పగించమని చెప్పు, లేదంటే నీ పిల్లలను ఎత్తుకెళ్లిపోతానని బెదిరించాడు. ఈ విషయం సుభాషిని ఫోన్‌ ద్వారా భర్త వీరరాఘవులుకు చెప్పింది. అదేం లేదు.. అతని భార్యను అతనికి అప్పగించేశానని చెప్పాడు. ఆ తర్వాత సుభాషిణి తన భర్తకు ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా కలవలేదు. ఈ నెల 9వ తేదీ ఉదయం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఒళ్లంతా దెబ్బలతో ఉన్న వీరరాఘవుల్ని పిడూరుమిట్టలోని సుభాషిని ఇంట్లో వదిలి వెళ్లారు. సుభాషిని భర్తను ఆరాగా తీయగా బట్టుపల్లికి చెందిన వివాహితను తీసుకుని నెల రోజుల క్రితం నెల్లూరుకు వచ్చానని, 15 రోజులు ఉండి, ఆమె తన భర్త వద్దకు వెళ్లిపోయిందని వీరరాఘవులు తెలిపాడు. ఆమె సెల్‌ఫోన్, కొద్దిగా బంగారం తన వద్ద ఉండిపోవడంతో వాటిని ఇస్తానని ఫోన్‌లో చెప్పగా బట్టుపల్లికి తీసుకుని రమ్మందని తెలిపిందని తెలిపాడు.

తాను ఫోన్, బంగారం ఇచ్చేందుకు ఈ నెల 7వ తేదీన బట్టుపల్లికి వెళ్లగా ఊరి బయట ఆమెను కలవగా ఇంతలో ఆమె భర్త గంగాధర్‌ వచ్చి ఇద్దరూ కలిసి కర్రలతో తీవ్రంగా కొట్టారని తెలిపాడు. తీవ్రంగా గాయపడిన భర్తను సుభాషిణి చికిత్స నిమిత్తం మొదట గూడూరు, నెల్లూరు ఆస్పత్రుల్లో వైద్యం చేయించి, మెరుగైన చికిత్స నిమిత్తం చెన్నై ప్రభుత్వాస్పత్రిలో చేర్పించింది. అక్కడ చికిత్స పొందుతూ శనివారం వీరరాఘవులు మృతి చెందాడు. దీంతో తన భర్త మరణానికి కారణమైన బట్టుపల్లికి చెందిన గంగాధర్, అతని భార్యపై చర్యలు తీసుకోవాలని ఆదివారం మనుబోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఘటన జరిగిన ప్రదేశం తమ పరిధి కాదని, మహబూబ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement