లక్నో : మద్యం బాటిళ్లు కొనేందుకు డబ్బులు ఇవ్వలేదని కడుపుతో ఉన్న భార్యను తుపాకితో కాల్చి చంపాడో కిరాతక భర్త. ఈ దారుణంగా ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని సర్పాథన్ ఏరియాలోగల భాటోలి గ్రామానికి చెందిన దీపక్ సింగ్.. భార్య నేహ(25), నాలుగేళ్ల కొడుకుతో ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల కుటుంబంతో కలిసి సొంతూరుకు వచ్చిన దీపక్.. లాక్‌డౌన్ కారణంగా ఇక్కడే ఉండిపోయాడు.
నెలన్నర రోజుల తర్వాత మద్యం షాపులు తెరవడంతో లిక్కర్ కొనేందుకు దిపక్ భార్య నేహను డబ్బులు అడిగాడు. ఇందుకు ఆమె నిరాకరించింది. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో సరుకులు కొనడానికే డబ్బులు లేవని, ఇలాంటి సమయంలో మద్యం సేవించవద్దని కోరింది. ఈ నేపథ్యలో భార్య భర్తలకు గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన దీపక్.. ఇంట్లో ఉన్నతుపాకితో భార్యను కాల్చి చంపాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న కుమారుడు(4) భయంతో పక్కనే ఉన్న పొదల్లోకి పారిపోయాడు. తుపాకి శబ్దం విన్న ఇరుగుపొరుగు వారు హుటాహుటిన దీపక్ ఇంటికిచేరుకొని.. నేహను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మంగళవారం మృతి చెందారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. దీపక్‌ను అరెస్ట్ చేశామని, మృతి చెందిన నేహ నాలుగునెలల గర్భవతి అని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment