
మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్సై సుబ్బరాజు ఇన్‌సెట్‌లో బ్రహ్మానందరెడ్డి మృతదేహం
అద్దంకి రూరల్: పొలం కొనుగోలు విషయంలో మధ్యవర్తులు తనను మోసం చేశారని ఆవేదన చెందిన ఓ వ్యక్తి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం మండలంలోని వేలమూరిపాడు గ్రామంలో పొలాల్లో వెలుగు చూసింది. పోలీసులు, మృతుని వద్ద లభించిన లేఖ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేడగం బ్రహ్మానందరెడ్డి (51) ముండ్లమూరు మండలలోని సుంకరవారి పాలెం గ్రామంలో 2011లో 15 ఎకరాల పొలాన్ని రూ. 30 లక్షలకు నలుగురు వద్ద కొనుగోలు చేశాడు. ఆ భూమిని తన పేరపై రిజిస్ట్రేషన్ చేయాలని పలుమార్లు కోరినా, వారు పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన బ్రహ్మానందరెడ్డి కోర్డులో కేసు వేశాడు.
కోర్టులో సమస్యల త్వరగా తేలకపోవడం, భూమి కొనుగోలు కోసం తెచ్చిన సొమ్ముకు వడ్డీ పెరిగిపోవడం.. అప్పు ఇచ్చిన వారు బాకీ తీర్చాలని ఒత్తిడి చేయడం వంటి కారణాలతో మనోవదేనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో వెలమూరిపాడు గ్రామంలో అతను కొనుగోలు చేసిన పొలంలోకి వెళ్లి, పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం పొలాల్లోని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి అధికారులకు విషయం తెలియపరచారు. ఎస్సై సుబ్బరాజు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని జేబులో ఉన్న లేఖను స్వాధీనం చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు.