నిందితుడు మారుతీరావు
మిర్యాలగూడ(నల్గొండ) : మిర్యాలగూడలో సంచలనం కలిగించిన పెరుమాళ్ల ప్రణయ్ హత్యలో ప్రధాన నిందితుడు మారుతీరావుది మొదటి నుంచి నేర చరిత్రగా చెప్పవచ్చు. సొంత కూతురు ప్రేమ వివాహం చేసుకుంటేనే పరువు హత్య చేయించిన అతనికి సెటిల్‌మెంట్‌లు, దందాలు, కబ్జాలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. రాజకీయ నాయకుల పలుకుబడితో అధికారులను సైతం తన బుట్టలో వేసుకుని ఆస్తులు కూడబెట్టుకున్నట్లు సమాచారం. 25 ఏళ్ల క్రితం మిర్యాలగూడ పట్టణంలో ఒక్క చిన్న స్కూటర్‌పై తిరిగే అతను అనతికాలంలోనే కోట్ల రూపాయలకు అధిపతిగా చెలామణి అయ్యాడు. తనతోపాటు తన తమ్ముడు శ్రవణ్‌తో కలిసి కిరోసిన్ దందా నిర్వహించిన మారుతీరావు భూ కబ్జాదారుడిగా అవతారమెత్తి కోట్ల రూపాయల ఆస్తులు కూడగట్టుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
భూ కబ్జాల సమయంలో సుపారీ గ్యాంగ్‌లతో సంబంధాలు పెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతూ ఆస్తులు సంపాదించినట్లు సమాచారం. 25ఏళ్ల క్రితమే మిర్యాలగూడ పట్టణంలో ఓ లాడ్జిలో నీలి చిత్రాలు తీస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో తిరునగరు శ్రవణ్‌ను పోలీసులు అరెస్టు చేసి కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. దీంతో పాటు మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో పాగా వేసి తన పేరున మార్పిడి చేసుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. 20 ఏళ్ల క్రితం మిర్యాలగూడ తహసీల్దార్‌గా పనిచేసిన ఓ రిటైర్డ్ అధికారి అండ దండలతో ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి కబ్జాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.
ఇటీవల మిర్యాలగూడ పట్టణ సమీపంలో 626 సర్వే నంబర్‌లో ఉన్న భూమిని ఆక్రమించుకున్నట్లుగా షెడ్యూల్డ్ కులాల వారు ఆందోళనలు నిర్వహించగా మారుతీరావు చేతిలో ఉన్న 20 కుంటల భూమిని ప్రభుత్వ స్వాధీనం చేసుకుంది. అదే విధంగా సర్వే నంబర్ 716, 756 లలో కూడా ప్రభుత్వ భూములను బినామీల పేరుతో కబ్జాలు చేసినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. అదేవిధంగా చింతపల్లిలో రోడ్డు పక్కన, అద్దంకి – నార్కట్‌పల్లి రోడ్డు వెంట మరికొంత భూమి ఉండగా దానిలో ఒక గది నిర్మించి సొంతం చేసుకున్నట్లు తెలి సింది. మిర్యాలగూడలోని కూరగాయల మార్కెట్, పాత బస్టాండ్ ఏరియాలో మున్సిపాలిటీకి సంబంధించిన నాలుగు దుకాణాలు ఖాళీ చేయించి వెనుక వైపున ఉన్న తన ఖాళీ స్థలంలో సొంత భవనం నిర్మించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయినా మున్సి పాలిటీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అధికార పార్టీ అండదండలు
ఆయనకు మొదటి నుంచి కూడా అధికార పార్టీ అండదండలు ఉండేవి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆయా నాయకులతో మంచి సంబంధాలను పెట్టుకునేవారు. ఎ లాంటి వివాదాలు వచ్చినా వారి అండదండలతో ఆస్తులు సంపాదించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరాడు. ఆయన దందాలకు పార్టీ పెద్దల అండదండలు ఉంటాయని భావించి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీలో చేరడం ఆయన నైజం. అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఇటీవల తనకంటూ ఒక వర్గం ఉండాలని కొంతమందిని కూడగట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment