
హత్యలకు దారితీస్తున్న వివాహేతర సంబంధాలు
నెల్లూరు(క్రైమ్): దాంపత్య జీవితంలో ఆలుమగల మధ్య అనురాగం, ఆప్యాయత, అన్యోన్యత కనుమరుగైతే అనుమానం పెనుభూతంలా మారి పచ్చని కాపురాలను దహించి వేస్తుంది. క్షణికానందం కోసం ఇద్దరు వ్యక్తులు చేసే తప్పిదాలు వారి కుటుంబాలను వీధిన పడేస్తున్నాయి. వివాహేతర సంబంధాలు మానవత్వాన్ని మంటగలిపి హత్యలకు దారితీస్తున్నాయి. వివాహ సమయంలో దంపతులు ఏడడుగులు నడిచి జీవితాంతం ఎంతటి కష్టం వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కలిసి ఉంటామని బాసలు చేసిన గొంతుకలు అర్ధాంతరంగా మూగబోతున్నాయి. దీంతో కొన్ని కుటుంబాలు నా అనేవారు లేకుండా తుడిచి పెట్టుకుని పోతున్నాయి. భార్యపై భర్తకు అనుమానం వచ్చి బలితీసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. అదే సమయంలో ప్రియుడి కోసం భర్తలను హత్య చేయడానికి వెనుకాడని భార్యల నేరాలు వెలుగుచూస్తున్నాయి. జిల్లాలో ఈ తరహా వికృతాలు పెరిగాయనే విషయం కొన్ని ఘటనలను పరిశీలిస్తే అర్థమవుతుంది.
రోజురోజుకు..
జిల్లాలో ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దంపతుల నడుమ చెలరేగిన వివాదాలు హత్యలకు దారితీస్తున్నాయి. భర్తలు మద్యానికి బానిసలుగా మారడం సైతం ఇలాంటి దుశ్చర్యలకు కారణాలుగా మారుతున్నాయి. ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారాయి. దాంపత్య విలువలు విస్మరిస్తే ఇలాంటి అనర్ధాలు తప్పవని పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి.
కొన్ని సంఘటనలు
♦ గతంలో తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఓ ఆటోడ్రైవర్‌ను అతని భార్య, ఆమె ప్రియుడు కిరాయి హంతకులకు రూ.లక్ష సుపారీ ఇచ్చి హత్య చేయించారు.
♦ ముత్తుకూరు మండలంలో దంపతులు ఉండేవారు. వివాహితకు ఓ వ్యక్తితో పరిచమైంది. ఇద్దరూ వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చారు. ఈ విషయం ఆమె భర్తకు తెలిసింది. దీంతో కోపోద్రిక్తుడైన అతను వారిద్దరూ తన ఇంట్లో ఉండగా బయట గడియపెట్టి నిప్పంటించారు. ఇద్దరూ సజీవదహనం అయ్యారు. ఈ సంఘటన గతేడాది జూలై 4వ తేదీన జరిగింది.
♦ డిసెంబర్ 5వ తేదీన రైలువీధిలో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అక్కసుతో వివాహితను ఆమె భర్త హత్య చేశాడు.
♦ ఈ ఏడాది జనవరిలో నవాబుపేట పోలీసు స్టేషన్ పరిధిలోని రాజీవ్‌గాంధీకాలనీలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ మహిళ దారుణహత్యకు గురైంది.
ఫిబ్రవరిలో వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు భార్యను ఆమె భర్త కడతేర్చాడు.
♦ ఏప్రిల్ 24వ తేదీన వివాహేతర సంబంధం నేపథ్యంలో రైసుమిల్లు ఆపరేటర్ శ్రీనివాసులును ప్రియురాలు తన స్నేహితుడితో కలిసి అతి దారుణంగా హత్యచేసింది.
♦ మే 28వ తేదీన రామలింగాపురంలో మహిళను ఆమె సన్నిహితుడే అతి దారుణంగా హత్యచేసి నగలు అపహరించాడు.
♦ మనుబోలులో మండలంలోనూ ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు.
జీవితాలను నాశనం చేసుకుంటున్నారు
ఈ తరహా సంబంధాలతో జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. „క్షణికానందం కోసం జరిగే సంబంధాలతో ప్రాణాలే పోతున్నాయి. తాళికట్టి వివాహం చేసుకున్న భార్యను భర్త మోసం చేయడం, భర్త కళ్లుగప్పి తప్పు ఆలోచనలతో భార్య పెడదారిపట్టడం తమని తామే మోసం చేసుకోవడమే అవుతుంది. దంపతులిద్దరూ ఇలాంటి చర్యలకు లోనుకాకుండా ఉంటే హత్యలను రూపుమాపవచ్చు.
– పి.శ్రీధర్, మహిళా స్టేషన్ డీఎస్పీ, నెల్లూరు