![Muslim Man Slapped in Train by mob in West Bengal - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/27/Muslim-Man-Train-Beat-Up.jpg.webp?itok=FxiE0Tyd)
వీడియోలోని దృశ్యాల ఆధారంగా చిత్రం
మాల్దా: ‘నాకు చదువు రాదు.. బయటి విషయాలు నాకు పెద్దగా తెలీదు’ అని చెబుతున్నా వినకుండా ఓ యువకుడిని నిర్దాక్షిణ్యంగా కొందరు చితకబాదారు. పశ్చిమ బెంగాల్‌లో ఈ చోటు చేసుకోగా, ఆ ఘటన తాలుకూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాధితుడి కథనం ప్రకారం... కలియాచక్(మాల్దా జిల్లా)కు చెందిన సదరు యువకుడు, హౌరా పట్టణంలో కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఈ నెల 14వ తేదీన సదరు యువకుడు రైల్లో తిరుగు ప్రయాణం అయ్యాడు. మార్గం మధ్యలో నలుగురు వ్యక్తులు రైలు ఎక్కి అతని ముందు సీట్లో కూర్చున్నారు. ముందు సరదాగా అతనితో మాటలు కలిపిన ఆ నలుగురు.. తర్వాత విజ్ఞాన ప్రదర్శన మొదలుపెట్టారు. మన ప్రధాని ఎవరు? మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? జాతీయ గీతం పాడు? అంటూ ఆ యువకుడిని కోరారు.
అయితే తడబడుతూనే సమాధానాలు చెప్పేందుకు యత్నించిన ఆ యువకుడి చెంప పగలకొట్టారు. తాను పెద్దగా చదువుకోలేదని.. ఆ విషయాలు అంతగా తెలీదని సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం విని వాళ్లు మరింతగా రెచ్చిపోయారు. సంభాషణ మధ్యలో అతను ముస్లిం అని గ్రహించిన ఆ నలుగురు.. నమాజ్ ఎలా చదవాలో నీకు తెలుసు కదా? అని ప్రశ్నించారు. దానికి అతను అవుననే సమాధానం ఇచ్చాడు. అలాంటప్పుడు జాతీయ గీతం గురించి తెలీదా? అంటూ దుర్భషలాడుతూ చెయ్యి చేసుకున్నారు. ఆపై బందేల్ స్టేషన్‌లో ఆ నలుగురు దిగిపోయారు. ఓ ప్రయాణికుడు అదంతా వ్యక్తి దాన్ని వీడియో తీసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయగా, అది కాస్త వైరల్ అయ్యింది. చివరకు బంగ్లా సంక్రీతి అనే ఎన్టీవో ఇచ్చిన ఫిర్యాదుతో కలియాచక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment