
మౌనిక (ఫైల్)
సాక్షి, తాడేపల్లిగూడెం రూరల్: పెళ్లైన నాలుగు నెలలకే ఓ నవవధువు, గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. భర్తంటే ఇష్టంలేకనే చనిపోతున్నట్టు సెల్ఫీ వీడియో తీయడం కలకలం రేగింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆదివారం జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం 30వ వార్డు కొండయ్య చెరువు పరంజ్యోతి స్కూలు సమీపంలోని తిరుమల ఎన్‌క్లేవ్‌లో రైల్వే పార్శిల్ సర్వీస్ ఉద్యోగి ఉద్దండి వీరవెంకటనాగేశ్వరరావు ఉంటున్నారు. ఆయన తన కుమార్తె మౌనిక (24)ను ఆగస్టులో ఒంగోలుకు చెందిన తిరుమలశెట్టి నరేంద్రకు ఇచ్చి పెళ్లిచేశారు. అతను బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం మౌనిక మూడవ నెల గర్భిణి. దీంతో నెల క్రితం బెంగళూరు నుంచి పుట్టింటికి వచ్చింది.
ఆదివారం ఉదయం తల్లిదండ్రులు రాజమండ్రి వెళ్లిన సమయంలో మౌనిక ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యను ముందుగా సెల్ఫీవీడియో తీసింది. భర్తంటే ఇష్టం లేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోలో పేర్కొన్నట్టు సమాచారం. దీనిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.