
రేవంత్‌రెడ్డి
బంజారాహిల్స్: పోలీసు విధులకు ఆటంకం కలిగించి, విధి నిర్వహణలో ఉన్న అధికారిని తోసేసి దురుసుగా ప్రవర్తించిన ఘటనలో మల్కాజ్‌గిరి ఎంపీ, టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సోమవారం ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం.48లోని రేవంత్‌రెడ్డి నివాసం వద్ద తెల్లవారుజాము నుంచే జూబ్లీహిల్స్ పోలీసులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఆయనను హౌజ్ అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ కే.ఎస్.రావు, జూబ్లీహిల్స్ ఇన్ స్పెక్టర్ కె.బాలకృష్ణారెడ్డి, సెక్టార్ ఎస్‌ఐ నవీన్ రెడ్డి తదితరులు ఆయన ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి ఆయన బయటకు రాకుండా కట్టడి చేశారు.
అయితే మధ్యాహ్నం 12 గంటల సమయంలో రేవంత్‌రెడ్డి పోలీసు ఆదేశాలను బేఖాతరు చేస్తూ అనుచరులతో కలిసి అతివేగంగా ఇంట్లో నుంచి బయటకు దూసుకొ చ్చారు. ఆ సమయంలో అడ్డుకున్న ఎస్‌ఐ నవీన్ రెడ్డితో పాటు పలువురు పోలీసులను నెట్టుకుంటూ, పక్కకు తోసేస్తూ అప్పటికే సిద్ధంగా ఉన్న బైక్‌పై దూసుకుపోయారు. పోలీసులు అప్రమత్తమై చాలాదూరం చేజ్ చేసుకుంటూ వెళ్లినా అప్పటికే రేవంత్‌రెడ్డి ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఈ ఘటనలో నవీన్ రెడ్డికి గాయాలయ్యాయి. మిగతా పోలీసులను కూడా నెట్టుకుంటూ వెళ్లడంతో వారు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఎస్‌ఐ నవీన్ రెడ్డి పోలీసు విధులకు ఆటంకం కలిగించిన రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేయగా ఆయనపై ఐపీసీ సెక్షన్ 341, 332తో పాటు 353 కింద నాన్ బెయిలబుల్ సెక్షన్ ను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment