భగ్గుమన్న పాత కక్షలు | Old Rivalry Between Political Leaders In Nalgonda | Sakshi
Sakshi News home page

భగ్గుమన్న పాత కక్షలు

Published Sun, Feb 16 2020 8:01 AM | Last Updated on Sun, Feb 16 2020 8:01 AM

Old Rivalry Between Political Leaders In Nalgonda - Sakshi

వెంకన్న మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

సాక్షి, సూర్యాపేట రూరల్‌ :  యర్కారంలో పాతకక్షలు భగ్గుమన్నాయి. శనివారం తెల్లవారేసరికి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నేత, మాజీ సర్పంచ్‌ ఒంటెద్దు వెంకన్నయాదవ్‌ను అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన దావానంలా వ్యాపించింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ప్రజలంతా గాఢ నిద్రలో ఉండగా దారుణ ఘటన చోటుచేసుకుంది. సహకార ఎన్నికల ప్రచారం, ఓటర్లు క్యాంపునకు తరలింపు చినికిచినికి గాలి వాన చందంగా గ్రామంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నేతల మధ్య ఆజ్యం పోసింది.

దీంతో మాటువేసిన ప్రత్యర్థులు వెంకన్నను కిరాతకంగా హత్య చేశారు. రాజకీయ కక్షలు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ సూర్యాపేట మండలం యర్కారంలో భగ్గుమన్నాయి. 13 సంవత్సరాల క్రితం ఇదే గ్రామంలో రాజకీయ హత్య జరగగా శనివారం మరో రాజకీయ హత్య చోటు చేసుకుంది. దీంతో గ్రామ ప్రజలు ఉలిక్కిపడ్డారు. సహకార సంఘం ఎన్నికల నేపథ్యంలో మరో రాజకీయ హత్య గ్రామంలో జరగడం సంచలనంగా మారింది. 

13 ఏళ్ల తర్వాత .. 
13 సంవత్సరాల క్రితం ఇదే గ్రామంలో టీడీపీ, కాంగ్రెస్‌ వర్గీయుల మధ్య రాజకీయ కక్షలు తీవ్రతరమై మాజీ సర్పంచ్‌ మిద్దె రవీందర్‌ను టీడీపీ పార్టీకి చెందిన వారు గ్రామంలో హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇదే విషయమై కొంతకాలం కోర్టులో హత్య కేసుకు సంబంధించి కేసు నడిచినప్పటికి కేసు పెట్టిన వారిపై సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టులో ఈ  కేసును కొట్టేశారు. అప్పటి నుంచి గ్రామంలో నిత్యం ఇరు వర్గాల మధ్య రాజకీయ కక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. 

సర్పంచ్‌ ఎన్నిక నుంచి తారాస్థాయికి చేరి..
సంవత్సరం క్రితం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామానికి చెందిన చింతలపాటి మధు భార్య మౌనిక టీఆర్‌ఎస్‌ మద్దతుతో సర్పంచ్‌ బరిలో ఉండగా కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో ఆ పార్టీ గ్రామ నేత వడ్డే ఎల్లయ్య భార్య బరిలో నిలిచింది. కాగా ఓట్ల లెక్కింపులో ఒక్క ఓటుతో చింతలపాటి మౌనిక గెలుపొందడంతో ఎల్లయ్య రికౌంటింగ్‌ పెట్టించాడు. అయినప్పటికి మౌనిక 2 ఓట్లతో గెలవడంతో అప్పటి నుంచి రాజకీయ కక్షలు మరింత పెరిగాయి. ఆతర్వాత జరిగిన పలు ఎన్నికల్లో గ్రామంలో స్వల్ప ఘటనలు చోటుచేసుకున్నాయి. 

ఆజ్యం పోసిన ‘సహకార’ ఎన్నికలు
వెంకన్నయాదవ్‌ హత్యకు సహకార సంఘం ఎన్నిక ఆజ్యం పోసినట్లయిందని అనుచరులు పేర్కొంటున్నారు. ఈనెల 13న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌ వద్ద టీఆర్‌ఎస్‌ వారు ఓటర్ల క్యాంపెయిన్‌ నిర్వహించారు. ఆ ఫంక్షన్‌హాల్‌ వద్దకు వడ్డే ఎల్లయ్య తన అనుచరులతో వెళ్లి టీఆర్‌ఎస్‌ నాయకులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడే ఉన్న వంటెద్దు వెంకన్నయాదవ్, అతని అనుచరులు వడ్డేఎల్ల య్యతో వాగ్వావాదానికి దిగి చేయిచేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. అప్పటి నుంచి వెంకన్నయాదవ్‌పై పగ పెంచుకున్న వడ్డే ఎల్లయ్య అదు ను కోసం చూస్తు శనివారం తెల్లవారు జామును రెక్కి నిర్వహించి తన అనుచరులతో వెంకన్నయాదవ్‌పై రాళ్లు, తల్వార్‌లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి హత్యకు పాల్పడ్డారు. 

రాజకీయంగా రాణిస్తున్న వెంకన్న..
వెంకన్నయాదవ్‌ రెండు సార్లు టీడీపీ మండల అధ్యక్షుడిగా పనిచేయడంతో పాటు 2013లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో యర్కా రం గ్రామ సర్పంచ్‌గా గెలుపొందాడు. 2017 సంవత్సరంలో టీడీపీ నుంచి మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలో కొనసాగుతూ పార్టీ ప్రతిష్టతకు గ్రామంలో అహర్నిశలు కృషి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రామంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీ వర్గీయుల మధ్య కొనసాగుతున్న ఘర్షణలు హత్యకు దారితీసిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. 

జన సంద్రమైన ఏరియాస్పత్రి..
పోస్టుమార్టం నిమిత్తం వెంకన్నయాదవ్‌ మృతదేహం సూర్యాపేట ఏరియాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బంధుమిత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏరియాస్పత్రికి చేరుకోవడంతో ఆ ప్రాంగణం జనసంద్రంగా మారింది.  రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీపీ వట్టే జానయ్యయాదవ్‌లు కంటతడి పెట్టారు. పలువురు పార్టీ నాయకులు, నేతలు వెంకన్నయాదవ్‌ కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఏరియా ఆస్పత్రి వద్ద వెంకన్నయాదవ్‌ భార్య నిర్మల, పెద్దకూతురు మేఘన, చిన్నకూతురు సాత్విక రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. వెంకన్న కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, సూర్యాపేట ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ జీడి భిక్షం, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వై.వెంకటేశ్వర్లు, పెన్‌పహాడ్‌ ఎంపిపి నెమ్మాది భిక్షంతో పాటు పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు. 

‘సార్‌ మా డాడిని చంపిన వారిని పోలీసులకు అప్పజెప్పండి’
మృతుడు వెంకన్న చిన్న కుమార్తె సాత్విక సూ ర్యాపేట ఏరియాస్పత్రిలో మంత్రి జగదీశ్‌రెడ్డితో తన తండ్రిని చంపిన వారిని పోలీసులకు అప్పజెప్పమని అడగడంతో మంత్రి వెంటనే స్పందించి తప్పనిసరిగా అప్పజెప్పి కఠిన చర్యలు తీ సుకునే విధంగాచర్యలు తీసుకుంటామని చె ప్పారు.చిన్న వయసులో తండ్రి మరణం తట్టుకోలేక ఆ పాప మంత్రితో మా ట్లాడిన తీరు అందరినీ కలవరపరిచింది. 

పోలీస్‌ పహారాలో యర్కారం..
యర్కారం గ్రామంలో వెంకన్నయాదవ్‌ హ త్య జరగడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందో బస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ,నలుగురు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు, 45 మంది పోలీస్‌ సిబ్బంది పహారా నిర్వహిస్తున్నారు.

తొమ్మిది మందిపై కేసు
వెంకన్న హత్య కేసులో తొమ్మిది మంది నిందితులపై 304 సెక్షన్‌ కిందకేసు నమోదు చేసినట్లు సూర్యాపేట రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ శనివా రం తెలిపారు. గ్రామానికి చెందిన వడ్డే ఎల్లయ్య, కుంటిగొర్ల శ్రీను, కందిగ నా గయ్య, మారెపల్లి సతీష్, మిద్దె కిరణ్, మిద్దె సైదులు, మోదాల నా గయ్య, మోదాల శంకర్, బొర్ర అరుణ్‌ల పై హతుడు వెంకన్న బంధువు బొడ్డు కిరణ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు Ððవెల్లడించారు. నిందితులను సాధ్యమైనంత త్వరలో పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

టీఆర్‌ఎస్‌ మండల నాయకులు, మాజీ సర్పంచ్‌ ఒంటెద్దు వెంకన్నయాదవ్‌ను కాంగ్రెస్‌ పార్టీ దుండగులు హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని యర్కారం గ్రామంలో ఒంటెద్దు వెంకన్న యాదవ్‌ అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం మంత్రి విలేకరులో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే వెంకన్నను హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతటా గోదావరి జలాలు రావడంతో కాంగ్రెస్‌లో ఉన్న రైతులు సైతం ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు బీమా, రైతు బంధు ఇవ్వడంతో పాటు ప్రధాన మైన సాగునీరు ఇచ్చారని, అందరూ గులాబీ జెండా పట్టుకుని ఏకమౌతున్న తరుణంలో ఫ్యాక్షన్‌ రాజకీయాలకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శ్రీకారం చుడుతున్నారని విమర్శించారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ గోదావరి జలాలను పారిస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ రక్తపు ఏరులను పారిస్తోందని ఆరోపించారు. చట్టప్రకారమే చర్యలు తీసుకుంటామని, ఈ హత్యలో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చేస్తామన్నారు. పోలీసులు సాధ్యమైనంత త్వరలో వారిని అరెస్టు చేస్తారని తెలిపారు. శాంతి భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఏ గ్రామంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వెంకన్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వెంకన్నకు ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నానన్నారు.  కార్యక్రమంలో సూర్యాపేట ఎంపీపీ బీరఓలు రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ జీడి భిక్షం, భూక్య సంజీవనాయక్‌ పాల్గొన్నారు.

అర్ధరాత్రి ఉలిక్కిపడిన గ్రామం..
యర్కారం గ్రామంలో సహకార ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు టీఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ సర్పంచ్‌ ఒంటెద్దు వెంకన్న తన అనుచరులతో కలిసి వెళ్తున్న విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్‌ నాయకులు వడ్డే ఎల్లయ్య తన అనుచరులు రెక్కి నిర్వహించారు. వెంకన్నయాదవ్‌తో పాటు అతని అనుచరులను వెంటాడారు. దీంతో గ్రామంలోని ఆవుదొడ్డి వీరయ్య ఇంట్లో తలదాచుకునేందుకు వెంకన్నయాదవ్‌ అతని అనుచరులైన చింతలపాటి మధు, ఆవుదొడ్డి ప్రవీణ్‌ వెళ్లారు. అప్పటికే వీరయ్య కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా తలుపు బలవంతంగా నెట్టి ఇంట్లోకి వెళ్లి మరో గదిలో వెంకన్న, మధు, వంటగదిలో టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు ఆవుదొడ్డి ప్రవీణ్‌ తలదాచుకున్నారు.

ఈ విషయం తెలు సుకున్న వడ్డే ఎల్లయ్య అతన అనుచరులు ఇంటిపై దాడిచేసి వెంకన్నయాదవ్‌ ఉన్న గది తలుపులు పగులగొట్టి అందులోకి వెళ్లారు. అనంతరం ఇంటి యజమాని వీరయ్య, అతని కుమారుడు సందీప్‌ను ప్రత్యర్థులు బయటకు వెళ్లగొట్టారు. ఆ తర్వాత తల్వార్, కర్రలతో దాడి చేసి వెంకన్నను తీవ్రంగా గాయ పరిచారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వెంకన్న తలపై సంఘటన స్థలంలో కనిపించిన విసురురాయితో మోదడంతో  అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకన్న హత్య జరిగిన సమయంలో ఇదే గదిలో మధు పత్తి బస్తాల సందులో తలదాచుకున్నాడు.

వెంకన్న మృతిచెందాడని నిర్ధారించుకున్న వడ్డే ఎల్లయ్య తన అనుచరులతో కలిసి కారులో పారిపోయాడు. హత్య జరిగిన ఇంటి యజమాని కుమారుడు సందీప్‌ 100కు ఫోన్‌ చేసి చెప్పడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సూర్యాపేట ఏరియాస్పత్రికి  తరలించారు. గ్రామంలో ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రాత్రి నుండి పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.

ఘనంగా వెంకన్న అంత్యక్రియలు
మండలంలోని యర్కారం గ్రామంలో శనివారం తెల్లవారుజామున హత్యకు గురికాబడిన మాజీ సర్పంచ్, టీఆర్‌ఎస్‌ నేత వంటెద్దు వెంకన్నయాదవ్‌ అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. వెంకన్న అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు మంత్రి అక్కడే ఉన్నారు. బంధు, మిత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వెంకన్న అంత్యక్రియల్లో పాల్గొనటంతో వీధులు కిక్కిరిసిపోయాయి.

అందరితో కలివిడిగా ఉండే వెంకన్న హత్యకు గురికావడంతో గ్రామస్తులు, పార్టీ నాయకులు కంటతడి పెట్టారు. అంత్యక్రియల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, సూర్యాపేట ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ జీడి భిక్షం, మాజీ ఎంపీపీ వట్టే జానయ్యయాదవ్‌ పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement