సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరు నగరంలోని వివిధ రూట్లలో తిరిగే రద్దీ బస్సుల్లో సంచరిస్తూ సెల్‌ఫోన్లు తస్కరించి, ఫ్లాష్ చేయడం ద్వారా హైదరాబాద్ సహా అనేక నగరాల్లో విక్రయిస్తున్న ముఠా గుట్టును అక్కడి కోడిగహెల్లీ పోలీసులు రట్టు చేశారు. గత వారం ఓ నిందితుడిని పట్టున్న అధికారులు పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు. పోలీసులకు చిక్కిన నిందితుడు చెప్పిన వివరాల ఆధారంగా సోమవారం సిటీకి వచ్చిన ప్రత్యేక బృందం 50 సెల్‌ఫోన్లను రికవరీ చేసుకువెళ్ళింది. దాదాపు ఐదేళ్ళుగా వ్యవస్థీకృతంగా వ్యవహారాలు సాగిస్తున్న ఈ ముఠా ఇప్పటి వరకు బెంగళూరులోని వివిధ ప్రాంతాల నుంచి వేయి సెల్‌ఫోన్‌లు తస్కరించినట్లు అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గ్యాంగ్ తస్కరించిన ఫోన్లలో అత్యధికం హైదరాబాద్‌లోని సెకండ్ హ్యాండ్ మార్కెట్లలోనే విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. బెంగళూరులోని కోడిగహెల్లీ పోలీసుస్టేషన్ పరిధిలోని హెబ్బల ఫ్లైఓవర్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని గత వారం అదుపులోకి తీసుకున్నారు. ఇతడి వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో 45 సెల్‌ఫోన్లు కనిపించడంతో పోలీసుస్టేషన్‌కు తరలించారు.
ఆ వ్యక్తి బెంగళూరులోని ఆజాద్‌నగర్‌కు చెందిన ఇమ్రాన్ ఇలియాస్ ఖాన్‌గా గుర్తించారు. ఇతగాడు అక్కడి గుడ్డడహెల్లీ ప్రాంతానికి చెందిన నయాజ్‌తో కలిసి ముఠా కట్టాడని, కొన్నేళ్ళుగా బీఎంటీసీ బస్సుల్లో సంచరిస్తూ ప్రయాణికుల నుంచి సెల్‌ఫోన్ల తస్కరిస్తున్నారని తేలింది. ఈ గ్యాంగ్ చోరీ చేసిన ఫోన్లను తొలినాళ్ళల్లో బెంగళూరులోని సండే బజార్, బర్మా బజార్‌ల్లో విక్రయించేవాళ్ళు. అయితే అక్కడే నేరుగా అమ్మేస్తుండటంతో గతంలో పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. దీంతో తమ పంథా మార్చాలని నిర్ణయించుకున్న ఈ ద్వయం రాష్ట్రం బయటకు తరలించి విక్రయించడానికి ప్రయత్నాలు చేశారు. దీనికి ముందు తాము చోరీ చేసిన ఫోన్లను కొన్ని రకాలైన సాఫ్ట్‌వేర్స్ వినియోగించి ‘ఫ్లాష్’ చేసేవారు. ఇలా చేయడంతో పాటు ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్యూప్‌మెంట్ ఐడెంటిఫికేషన్ (ఐఎంఈఐ) నెంబర్‌ను క్లోన్ అయ్యేది. ఆపై కొత్త ఐఎంఈఐ నెంబర్‌తో సిద్ధమైన ఫోన్‌కు తక్కువ ధరకు విక్రంయిచే వారు. వీటిలో హైఎండ్ ఫోన్లను హైదరాబాద్, ముంబై, చెన్నైల్లో ఉన్న వ్యాపారుల ద్వారా అమ్మించే వాళ్ళు. కొన్నాళ్ళుగా వ్యవస్థీకృతంగా సాగుతున్న ఈ వ్యవహారంపై అక్కడి పోలీసులకు ఎలాంటి అనుమానం రాలేదు. అనుమానాస్పదంగా దొరికిన ఇలియాస్ ఖాన్ విచారణలో వెలుగులోకి రావడంతో నయాజ్ కోసం గాలిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని బెంగళూరు పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. సాంకేతికంగా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. సోమవారంలో హైదరాబాద్‌కు వచ్చిన ప్రత్యేక పోలీసు బృందం సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని వెళ్ళింది.
Comments
Please login to add a commentAdd a comment